నాగార్జున నటించిన చివరి చిత్రం 'మనం'. అది కూడా సోలో హీరోగా కాదు. ఆయన సోలో హీరోగా నటించిన చిత్రం విడుదలై చాలాకాలం అయింది. ఈ ఏడాది మరి కొన్నిరోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది అసలు బోణీ కొట్టలేదు నాగ్. దీంతో అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతో వెలితిగా ఫీలవుతున్నారు. కాగా ఈ ఏడాది గ్యాప్‌ను మరిపించేలా వచ్చే ఏడాది రెండూ మూడు నెలల గ్యాప్‌లో రెండు చిత్రాలను విడుదల చేసేందుకు నాగ్ ప్రయత్నిస్తున్నాడు. ఆయన నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తోన్న నాగ్, ఆ వెంటనే ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో తాను, కార్తీతో కలిసి చేస్తున్న 'ఊపిరి'ని రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. కాగా ఎంతో కాలం తర్వాత ఆయన సంక్రాంతి బరిలో నిలవడం, అందునా తన తోటి సీనియర్ హీరో బాలకృష్ణ వస్తోన్న సమయంలోనే తన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. వాస్తవానికి మిగిలిన హీరోలకంటే నాగ్‌లో ఇగో తక్కువ. ఎవరు ఏమనుకున్నా, తనకు నచ్చినప్పుడే విడుదల చేస్తాడు కానీ.. ముందుగా అనుకున్నామని, పోస్ట్‌పోన్ చేస్తే పరువు పోతుందని.. ఇలా భేషజాలకు పోకుండా ఉంటాడు. అయినా కూడా ఆయన నందమూరి హీరోలతో పోటీకి దిగుతూ, వస్తున్నా... హిట్టు కొట్టేస్తున్నాను... అంటూ ఇంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాడంటే ఆయనకు 'సోగ్గాడే చిన్నినాయన' అవుట్‌పుట్‌పై ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం అవుతోంది. మొత్తానికి ఈసారి ఎంతో నమ్మకంగా ఉన్న నాగ్ ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.