రవితేజ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే రవితేజ. దీనికి మరో అర్థం లేదు పరమార్థం లేదు. ఈ మధ్య విడుదలయిన బెంగాల్ టైగర్ ఈ విషయాన్ని మరోసారి గట్టిగా స్పష్టం చేసింది. దర్శకుడు సంపత్ నంది శ్రమని ఇక్కడ తగ్గించి చూపకపోయినా, ఈ సినిమాకి నిజంగా రవితేజ ఎనర్జీ వల్లే ఆపాటి బంపర్ కలెక్షన్లు వచ్చాయని అందరూ ఒప్పుకోవాల్సిందే. అదీ కిక్ 2లాంటి భారీ డిజాస్టర్ తరువాత. కానీ రవితేజ మీద మూస మాస్ పాత్రలు వేస్తేనే ఆడియెన్సు ఒప్పుకుంటారనే నానుడికి ఇక స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమయింది. ఎందుకంటే బెంగాల్ టైగర్ సెకండ్ హాఫ్ ఇంకాస్త బాగుంటే ఫలితం ఖచ్చితంగా 40 కోట్ల క్లబ్బులో ఉండేదేమో అన్నది కొందరి వాదన. బెంగాల్ టైగర్ ఫస్ట్ హాఫ్ మాంచి స్క్రీన్ ప్లే మీద అనుకోని ట్విస్టులతో వేగంగా రన్ అవుతుంది. అదే రెండో సగానికి వచ్చేసరికి నాసిగా అనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల మొత్తం సినిమా నాణ్యత మీదే దెబ్బ పడింది. ఇది లోతుగా గమనించిన రవితేజ రెగ్యులర్ అనిపించే పాత్రలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడట. అందుకు అనుగుణంగానే స్వామి రారా దర్శకుడు సుదీర్ వర్మ, భలే మంచి రోజు దర్శకుడు శ్రీరాం ఆదిత్యలలో ఎవరితో ఒకరితో క్రైమ్ యాక్షన్ కథను ప్లాన్ చేసే పనిలో ఉన్నాడని ఫిలిం నగర్ సమాచారం.