నేను దిగడమంటూ మొదలెడితే ఇది నా మొదటి మెట్టు, ఆఖరి మెట్టు ఎలా ఉంటుందో ఊహించుకోండి అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ఓ డైలాగు ఇప్పుడు రచయిత కోన వెంకట్ గారికి అక్షరాలా అతికింది. రాసింది ఎవరైనా మనకు పనికొచ్చిందా లేదా అని తెలుగు రచయితలు ఆలోచించినట్టుగానే కోన వెంకట్ గారు కూడా తాను దిగడం అంటూ మొదలెడితే అఖిల్, బ్రూస్ లీలు ఏంటి త్రిపుర, శంకరాభరణంలు ఏంటి ఇదిగో ఇలా ఎవరికీ సౌఖ్యం లేకుండా చేస్తాం అనేవరకు వచ్చింది. గోపీచంద్ హీరోగా రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో కోన వెంకట్, గోపి మోహన్ అండ్ శ్రీధర్ సీపానాలు కలిసి మనకు అందించిన సౌఖ్యం ఈరోజు ధియేటర్లలో దిగింది. మొదటి షోతోనే జనాలను షాకుకి గురిచేసి తెరుకోలేని దెబ్బ కొట్టింది. ట్రైలర్ చూసిన నాటి నుండీ ఇది రెగ్యులర్ కోన సినిమానే అని జనాలు ఫిక్స్ అయినా, ఈ మధ్య రిలీజయిన వాటి కన్నా ఎంతో కొంత బెటర్ ట్రీట్మెంట్ ఉండకపోతుందా అని గోపీచంద్ మీద నమ్మకంతో ఉన్న ప్రేక్షకులకి మొదటి సీన్ నుండి ఆఖరి సీన్ వరకు ప్రత్యక్ష్య నరకం చూపించి, ఇది సౌఖ్యం కాదు చూసే వారిపాలిట శోకం, శాపం అన్నట్టుగా ఉందని క్రిటిక్స్ ఊచకోత కోసి వదిలేసారు. కోన అండ్ టీం వారి ప్రతాపం ఇంతటితో ఆగుతుందా లేక దీనికి మించిన నరకాది నరకం మరోటి ఏదైనా వారి నుండి త్వరలో రానుందా?