భారీతనం అంటే ఏంటో శంకర్ సినిమాల్ని చూస్తే తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ భారీగా ఆలోచించడం ఆయన తర్వాతే ఎవరైనా. అయితే ఆ ఎఫెక్ట్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రతీ సన్నివేశం లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టుగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంటుంది. అందుకే శంకర్ సినిమాలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగా ఉంటాయి. 200కోట్లలోపు బడ్జెట్‌తో శంకర్ తీసిన సినిమాల్ని చూసే ఆ మాట అంటున్నామంటే ఇక ఆయనకి రూ: 400కోట్ల బడ్జెట్ ఇస్తూ సినిమా తీయమంటే ఆ గ్రాండ్‌నెస్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'రోబో 2.0'లో ఆ భారీ హంగులన్నీ మరింత గ్రాండ్‌గా సాక్షాత్కారం కాబోతున్నాయి.
ఇదివరకు వచ్చిన రోబోకి రెండింతల ఖర్చుతో రూపొందుతున్న రోబో 2.0 కోసం శంకర్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఇటీవలే ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. చెన్నైకి సమీపంలో ఓ భారీ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో త్వరలోనే షూటింగ్ చేయబోతున్నారు. సెట్‌తోపాటు శంకర్ 10 ప్రత్యేకమైన వాహనాల్ని తయారు చేయిస్తున్నాడు. ఒక్కొక్కటి కోటి రూపాయల వ్యయంతో మొత్తం 10కోట్లతో 10 వాహనాల్ని సిద్ధం చేయిస్తున్నాడు శంకర్. సుమారు 50కోట్లతో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతున్నట్టు తెలిసింది. ఇందులో రజనీకాంత్,అమీజాక్సన్ జంటగా నటిస్తున్నారు. అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 2017 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.