ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్‌లో పడిన ట్వీట్లతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. ఎన్టీఆర్‌లాంటి ఒక స్టార్ కథానాయకుడికి తన సినిమాకి సంబంధించి ఏం జరుగుతుందో తెలియదా? అసలు ఆ ట్వీట్లని ఏమని అర్థం చేసుకోవాలి? స‌్టార్లని నమ్మి సినిమాల్ని కొంటున్న బయ్యర్లు ఇలాంటి వ్యాఖ్యలని ఎలా తీసుకోవాలి? అంటూ పరిశ్రమ వర్గాలు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ సర్దుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయినా సరే ఆ ట్వీట్ల గురించి నలుగురు నాలుగు రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్‌లాంటి ఒక స్టార్ అకౌంట్ చేతిలోకొచ్చాక హ్యాకర్లు ఒక్క ట్వీటే ఎందుకు చేస్తారు? అది కూడా సినిమా గురించి మాత్రమే ఎందుకు చేస్తారు? అని నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కాదు... రెండు సార్లు ఆ ఒక్క ట్వీటే మళ్లీ మళ్లీ పడటం, ఆ వెంటనే డిలీట్ కావడంతో ఆ ట్వీట్ ఎన్టీఆర్ నుంచే వచ్చుంటుందని, అసలు నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `నాన్నకు ప్రేమతో` సినిమాని తారక్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొంటున్నారు. అయితే కొంత షూటింగ్ పార్ట్‌తోపాటు, నిర్మాణానంతర కార్యక్రమాలు బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతోపాటు సంక్రాంతికే బాలకృష్ణ సినిమా విడుదలవుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇదే దశలో ఎన్టీఆర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లు సినిమా విడుదల గురించి మరిన్ని డౌట్లు వ్యక్తమయ్యేలా చేశాయి.