పబ్లిసిటీ కోసం కొంతమంది ఏమైనా చేస్తుంటారు. అది చావా? పెళ్లా? లేక అక్కడ అవసరమా? అనవసరమా? అని కూడా ఆలోచించరు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా అలా జరిగి కూడా విమర్శల పాలవుతుంటారు. ఇలాంటి కోవలోనే ఇటీవల ఓ సంఘటన జరిగింది. ప్రముఖ నటుడు రంగనాథ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో వుంచారు. ప్రముఖులు వచ్చి రంగనాథ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా వచ్చి రంగనాథ్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు. ఇక అక్కడే ఇదే దొరికింది అవకాశం అన్నట్లుగా తలసానికి ‘మా’ అసోసియేషన్ విడుదల చేసిన డైరీలను అందజేసి ఫోటోలకు ఫోజిచ్చాడు ‘మా’ సెక్రటరీ శివాజీరాజా. అయితే అక్కడ వాటిని తీసుకునేందుకు మంత్రి తలసాని కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాడట.. కనీసం మంత్రి గారి ఫీలింగ్ అర్థం చేసుకుని శివాజీ..అక్కడ ఆ పంపిణీ కార్యక్రమం పెట్టాల్సింది కాదు అనీ అక్కడున్న వారు అనుకున్నారట..! ఏది ఏమైనా ఇది చూసిన వారు చనిపోయిన దగ్గర ఇది అవసరమా రాజా.. అంటూ శివాజీ వైపు చూశారట..! అయితే శివాజీరాజా.. అనుకోకుండా మంత్రి గారికి వాటిని అందజేశారే తప్ప... ఇలాంటివేమీ ఆలోచించలేదని ఆయన మిత్రుల చెబుతున్నారు.!