మొట్టమొదటి సారిగా అఖిల్ సినిమా ఒప్పుకుని తాను పెద్ద తప్పు చేసానని దర్శకుడు వీవీ వినాయక్ వినమ్రంగా మాట్లాడారు. కుర్రాడు అక్కినేని అఖిల్ మొత్తంగా డెడికేట్ అయి కష్టపడ్డా, తన టీం అతని స్టామినాను సరైన దిశలో ఉపయోగించుకోలేక పోయిందని అందుకే సినిమా బెడిసి కొట్టిందని చెప్పుకొచ్చారు. సోషియో ఫ్యాంటసీ కథలు వినడానికి అబ్బుర పరిచేలా ఉన్నా తెర మీద ప్రెజెంట్ చేసేప్పుడు జేజెమ్మ కనపడుతుంది. ఈ విషయం వినాయక్ గారికి తెలీదని కాదు, అయినా కథ ఏదో కొత్తగా ఉందని ట్రై చేసినట్టు చెప్పారు. గతంలో వినాయక్ చేసిన ఇటువంటి తప్పిదమే బద్రీనాథ్ కూడా. ఇవన్నీ చూసి మనం చెప్పుకోవాల్సిన, నిర్దారించుకోవాల్సిన సంగతి ఏమిటంటే వినాయక్ కొన్ని కథలను మాత్రమే అద్భుతంగా తెర మీదకు ఎక్కించగలరు. ముఖ్యంగా చిరంజీవితో చేసిన ఠాగూర్ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. అందుకే అఖిల్ ఫలితాన్ని మరిచిపోయి, మళ్ళీ చేసిన తప్పే చేయరన్న నమ్మకంతో చిరంజీవి గారు కత్తి కథను, కథనాన్ని తెలుగీకరించే పనిని వినాయక్ చేతుల్లో పెట్టారు. సోషల్ మెసేజ్ ఉన్న కత్తిని చిరంజీవి గారి మీద ప్రయోగించడం నిజంగా వినాయక్ గారికి కత్తి మీద సామే!