ఒకప్పుడు సినిమాలు తియ్యాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. చిన్న సినిమా అయినా బడ్జెట్ బాగానే అయ్యేది. కానీ, ఇప్పుడంతా మారిపోయింది. మొత్తం డిజిటలైజ్ అయిపోవడంతో ఫిల్మ్ ఖర్చు లేకుండా పోయింది. బెటర్‌మెంట్ కోసం ఎన్ని సీన్లయినా తీసుకోవడానికి డైరెక్టర్‌కి అవకాశం వుంది. అందుకే ఈమధ్యకాలంలో చాలా తక్కువ బడ్జెట్‌లో కూడా సినిమాలు తీసేస్తున్నారు. సినిమా తియ్యడం వరకు బాగానే వుంటుంది కానీ దాన్ని రిలీజ్ చెయ్యాలంటే ఎవరి తరం కాని పరిస్థితి ఇక్కడ వుంది.
ఈ విషయంలో కన్నడ చిత్ర పరిశ్రమ వేరుగా వుంది. తెలుగులో సినిమా తీసే బడ్జెట్‌తో కన్నడలో చాలా క్వాలిటీ మూవీ తియ్యొచ్చు అని చెప్తున్నారు కొంతమంది నిర్మాతలు. తెలంగాణలోగానీ, ఆంధ్రప్రదేశ్‌లోగానీ సినిమా తియ్యాలంటే లొకేషన్లకే చాలా ఖర్చవుతోందట. కష్టపడి సినిమా కంప్లీట్‌చేసి రిలీజ్ చేసినా శాటిలైట్ కొనేవారు లేక చాలామంది నిర్మాతలు నష్టపోతున్నారు. అదే కన్నడలో సినిమా తియ్యాలంటే ఖర్చు చాలా తక్కువవుతుంది, శాటిలైట్ రైట్స్‌కి కూడా మంచి రేటు వస్తుంది. దీంతో మన దర్శకనిర్మాతలు కూడా కన్నడలో సినిమాలు చెయ్యాలని ట్రై చేస్తున్నారు. కర్ణాటకలోని చాలా ప్రదేశాలు షూటింగ్‌కి ఫ్రీగా ఇచ్చేస్తారట. కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చెయ్యాలంటే డబ్బు చెల్లించాల్సి వుంటుంది. అది కూడా నామమాత్రంగానే వుంటుందట. అంతేకాదు కాస్త ట్రై చేస్తే కర్ణాటక గవర్నమెంట్ నుంచి 10లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశం వుందట. ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చెయ్యాలనుకునేవారు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ తియ్యాలనుకునేవారు మొదట కన్నడలో చేసి ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత తెలుగులో చెయ్యడం ఈజీ. ప్రస్తుతం ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నవారు చాలామంది వున్నట్టు తెలుస్తోంది. అలా కన్నడలో తెలుగువారు చేసే సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో?