ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే తరువాతి చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు మన హీరోలు. ప్రస్తుతం చేస్తున్న సినిమాను తొందరగా పూర్తి చేస్తే తదుపరి చిత్రాన్ని ప్రారంబించాల్సి ఉందని, తరువాతి సినిమాల షూటింగ్‌ను ఎప్పుడు ప్రారంభించనున్నారో ముందుగానే ఫిక్స్ చేసి ప్రస్తుత సినిమా డైరెక్టర్లను టెన్షన్ పెట్టేస్తున్నారు. మహేష్‌బాబు 'శ్రీమంతుడు' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని ప్రారంభించాడు. 'శ్రీమంతుడు'ను తొందరగా ఫినిష్ చేస్తే 'బ్రహ్మోత్సవం' రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాల్సి వుందని కొరటాలపై ఒత్తిడి చేశాడు. ఇప్పుడు 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉంటూనే తన తదుపరి మురుగదాస్ సినిమాకు ఓపెనింగ్ డేట్‌ను ఫిక్స్ చేసి శ్రీకాంత్ అడ్డాలపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇక ప్రస్తుతం సుకుమార్‌తో 'నాన్నకు ప్రేమతో' చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రాన్ని ప్రారంభించాలని, తొందరగా ఈ సినిమాను పూర్తి చేస్తే కొరటాల సినిమాను ప్రారంభించాల్సివుందని సుక్కు మెడపై కత్తిపెట్టాడు. ఇక సూర్య కూడా ప్రస్తుతం 'సింగం 3' చిత్రం చేస్తూ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయడానికి డిసైడ్ చేసేశాడు. 'సింగం 3'ని వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు హరిని తొందరపెడుతూ ఉన్నాడట. ఇలా చేయడం వల్ల కొన్ని విషయాల్లో హీరోలకు మంచే జరుగుతుందని.. కానీ కొన్ని సార్లు మాత్రం డైరెక్టర్లను తొందరపెట్టడం వల్ల అసలుకే మోసం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.