విజయశాంతి పర్సనల్ మేకప్‌మేన్‌గా వర్క్ చేసి చాలా తక్కువ టైమ్‌లో ప్రముఖ నిర్మాతగా ఎదిగిన ఎ.ఎం.రత్నం సూర్యా మూవీస్ బేనర్‌లో ఎన్నో భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అందులో ఎక్కువ శాతం శంకర్ డైరెక్ట్ చేసిన సినిమాలే వుండడం విశేషం. తమిళ్, తెలుగు భాషల్లో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఒకేఒక్కడు చిత్రాన్ని హిందీలో అనిల్‌కపూర్‌తో చాలా భారీ బడ్జెట్‌లో తీశాడు. అక్కడ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆర్థికంగా బాగా నష్టపోయాడు. దానికితోడు రత్నం పెద్ద కుమారుడు జోతికృష్ణ డైరెక్షన్‌లో తరుణ్, త్రిష, శ్రీయ ప్రధాన పాత్రల్లో నిర్మించిన నీ మనసు నాకు తెలుసు చిత్రం కూడా ఫ్లాప్ అవ్వడంతో అతనికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. అదే టైమ్‌లో చిన్న కుమారుడు రవికృష్ణ, ఇలియానా జంటగా జోతికృష్ణ డైరెక్షన్‌లో నిర్మించిన జాదూ అనే సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. తెలుగులో చిరంజీవి, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో, తమిళ్‌లో విక్రమ్, విజయ్, మాధవన్, అర్జున్, అజిత్ వంటి టాప్ హీరోలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ నిర్మించిన రత్నం ఒకే ఒక్కడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యడం, కొడుకు డైరెక్షన్‌లో వరసగా రెండు సినిమాలు నిర్మించడంతో నిర్మాతగా కొనసాగలేకపోయాడు.
దాదాపు 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత అజిత్‌తో తమిళ్‌లో చేసిన ఆరంభం పెద్ద హిట్ కావడంతో రత్నం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు రత్నంకి. అజిత్‌తోనే ఎన్నయ్ అరిందాల్ చిత్రాన్ని చేసి సూపర్‌హిట్ కొట్టాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా అజిత్ హీరోగా శౌర్యం శివ దర్శకత్వంలో రత్నం నిర్మించిన వేదాలమ్ కూడా పెద్ద హిట్ అయింది. ఇదిలా వుండగా రత్నం గతంలోనే చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నాడా అనిపిస్తోంది. ఎందుకంటే మళ్ళీ కొడుకు డైరెక్షన్‌లో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. జోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెలుగులో ఆక్సిజన్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు. నిర్మాతగా టాప్ పొజిషన్‌లో రత్నం హిందీలో చేసిన నాయక్ వల్ల, కొడుకు డైరెక్షన్‌లో చేసిన రెండు సినిమాల వల్లే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాడు. ఇప్పుడు కోలుకొని నిర్మాతగా లాభాల్ని చూస్తున్న రత్నంకి మళ్ళీ కొడుకు డైరెక్షన్‌లో సినిమా చెయ్యడం అవసరమా? అని అతని సహచరులు, అతని గురించి బాగా తెలిసినవారు అనుకుంటున్నారు. ప్రస్తుతం రత్నం టైమ్ బాగుంది కాబట్టి గోపీచంద్ హీరోగా జోతికృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆక్సిజన్ చిత్రం కూడా సూపర్‌హిట్ అవుతుందేమో ఎవరికి తెలుసు?