మనం ఎలాంటి చిత్రాల్లో నటించాలి అని నిర్ణయించుకునే అవకాశం మనకులేదు. ప్రేక్షకులు మన నుండి ఏమి ఆశిస్తున్నారు? ఎలాంటి చిత్రాలను చేయాలని కోరుకుంటున్నారు? అనేది నిర్ణయించాల్సింది ప్రేక్షకులే. వాస్తవానికి హీరో గోపీచంద్‌కు మాస్ ఇమేజ్ బాగా ఉంది. ఆయన నటించిన బోలెడు యాక్షన్ చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అయితే గత కొంతకాలంగా గోపీచంద్‌కు అనూహ్య పరాజయాలు ఎదురవుతున్నాయి. దాంతో ఆయన తన రూట్ మార్చి 'లౌక్యం'తో ఎంటర్‌టైనర్‌ను అందించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించి గోపీచంద్‌కు మంచి లైఫ్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటకు తీసి 'జిల్' చేశాడు. ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకొంది. దీంతో ఆయన మరలా కామెడీ కంటెంట్‌తో హిట్ కొట్టాలని నిర్ణయించుకొని ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకొని చేస్తున్న చిత్రం 'సౌఖ్యం'. ఇలా ఆయన యాక్షన్ బాటను వదిలేసి కామెడీ వైపు అడుగులు వేస్తూ... ఇమేజ్ కోసం మేకోవర్‌పై దృష్టిపెట్టాడు. ఇందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన 'బాహుబలి' స్ఫూఫ్‌తో, బ్రహ్మానందం మరో కీలకపాత్రలో మంచి కామెడీ పంచనున్నారని తెలుస్తోంది. మొత్తానికి 'యజ్ఞం' సినిమాతో గోపీచంద్‌ను హీరోగా నిలబెట్టిన రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న 'సౌఖ్యం'కు రెజీనా అందాలు కూడా ప్లస్ కానున్నాయట. మొత్తానికి ఈ సారి గోపీచంద్ 'సౌఖ్యం'తో ఎలాంటి హిట్ కొట్టబోతున్నాడు అనేది క్రిస్మస్‌కు తేలిపోనుంది!