యావత్ భారత దేశ చిత్ర పరిశ్రమను తన సంగీతంతో ఉర్రూతలూగిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారి తండ్రి సత్యమూర్తి గారు అకాల మరణం చెందారు. రచయితగా సుమారు 90 చిత్రాల వరకు పని చేసిన సత్యమూర్తి గారి వయసు 61 సంవత్సరాలు. నిన్న రాత్రి ఆయన చెన్నై నివాసంలో గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు తెలుస్తోంది. సత్యమూర్తి గారు తెలుగు, తమిళ సినిమా సెలబ్రిటీ కుటుంబాలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. చిరంజీవి కుటుంబానికి సత్యమూర్తి బాగా కావాల్సిన వ్యక్తిగా పలు సందర్భాల్లో చెప్పేవారు. తండ్రి చూపిన రచయిత బాటలో కాకుండా దేవి సంగీత దర్శకుడిగా అమోఘమైన ఖ్యాతిని సంపాదించాడు. చెన్నైలోనే ఈరోజు సాయంత్రం కర్మఖాండ, అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టాలివుడ్, కాలీవుడ్ ఒక్కసారిగా సత్యమూర్తి గారి మరణ వార్తతో ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది.