మల్టీ స్టారర్ సినిమాలనే టాలివుడ్ జనాలు మరిచిపోతున్న తరుణంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఆ ట్రెండుకు పునర్జీవం పోసిన మహేష్ బాబు మళ్ళీ ఇంకోసారి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. ఏ రోజు పూరి జగన్నాథ్ గారిని కలిసినా ఆ రోజు ఓ కొత్త బ్రేకింగ్ న్యూస్ బయటికొస్తుంది. లోఫర్ రిలీజు ముంగిట ఈసారి మీడియా మిత్రులతో మాట్లాడుతూ తాను మహేష్ బాబు కోసం ఓ భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నానని, అందుకు తగ్గ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి హిట్టు సినిమాలకు కలిసి పని చేసిన ఈ జంట మళ్ళీ ముచ్చటగా మూడోసారి జట్టు కట్టబోతున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్కడే కాకుండా మరో స్టార్ హీరో కూడా పని చేస్తారని పూరి చెప్పడం సెన్సేషనల్ న్యూస్. ఒక్క హీరోను డీల్ చేస్తేనే సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకుపోయే పూరి ఏకంగా ఇద్దరు హీరోలతో అంటే స్క్రిప్టులో ఎంత ఫైర్ ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుద్దో చెబితే మరింత మజాగా ఉండేది కదా...!