తెలుగు సినిమాలకున్న ఏకైక హెవీ మార్కెట్ జోన్ కేవలం మాస్ చిత్రాలు రిలీజయినప్పుడే బయట పడుతుంది. సరైన దర్శకుడు, సరైన హీరో, సరైన కథనం తగలాలే గానీ బాక్సాఫీసుకు ఎల్లలే ఉండవు. సినిమాకు కావాల్సింది లాజిక్కులు కాదు హీరో మీద చేసే మ్యాజిక్కులు. ఏ దర్శకుడైతే ఆ పనిని సక్రమంగా చేసుకుంటూ పోతాడో వారే పరిపూర్ణమైన మాస్ దర్శకుడిగా అవతరిస్తారు. ఇప్పటికైతే వినాయక్, శ్రీను వైట్ల లాంటి వారు ఓటమి దెబ్బలు తగిలి ఖ్యాతి మసకబారిపోయిన వేళ, సంపత్ నంది మరోసారి తనలోని మాస్ పోకడను రవితేజ మీద ప్రయోగించి బెంగాల్ టైగర్ అంటూ విజయం నుండి దిగ్విజయం దిశగా దూసుకుపోతున్నాడు. మాస్, కమర్షియల్ సినిమా ప్యాకేజీలో ఏ సరుకు, ఏ సరంజామా ఎంతెంత మోతాదులో జోకితే ఎంతెంత అవుట్ పుట్ వస్తుందో పక్కాగా తెలిసిన నిష్ణాతుడిలా సంపత్ నంది బెంగాల్ టైగర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రవితేజ జీవితంలో ఇప్పటి వరకు తాకని 30, 40 కోట్ల మార్కెట్టును బెంగాల్ టైగర్ తాకబోతోంది అంటే ఇది నిజంగా భీభత్సమే. అవును సంపత్ నంది చేసిన రెండో మూవీ రచ్చ కూడా రామ్ చరణ్ కెరీర్లో మగధీర తరవాతి పొజిషన్లో నిలుచుంది అంటే ఇది కూడా ఓ బెంచ్ మార్క్. ఈ విధంగా సంపత్ నంది క్రేజీ హ్యాట్ ట్రిక్ సొంతం చేసుకున్నాడు.