చందమామ అందరికీ మామ అన్నట్లుగా హీరోలకు, దర్శకులు పవన్ ఉమ్మడి ఆస్థిగా మారిపోయాడు. వీరందరికీ పవన్ నామస్మరణ తప్పడం లేదు. ఇంతకాలం ఆయన్ను మెగాహీరోలైన రామ్‌చరణ్, బన్నీ వంటి మెగాహీరోలే వాడుకొనే వారు. కానీ ఉన్నట్లుండి లైన్‌లోకి వచ్చిన నితిన్ పవన్ నామస్మరణలో స్పెషలిస్ట్ అనే ముద్ర వేసుకున్నాడు. పవన్ నామస్మరణ తర్వాతే ఆయన మరలా హిట్ ట్రాక్‌లోకి వచ్చి మెగాఫ్యాన్స్ అండదండలు సంపాదించాడు. ఇలా నితిన్ నుండి నిఖిల్ వరకు, కోన నుండి త్రివిక్రమ్ వరకు పవన్ నామస్మరణ చేస్తున్నారు. ఇలా పవన్‌ని తమ సొంత ఆస్థిలా భావించి ఆయన పేరును బాగా వాడేస్తున్నారు. దాంతో ఆయా సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ జరుగుతోంది. పవన్ బర్త్‌డే కానుకగా కోనవెంకట్ ఏకంగా పవన్‌పై ఓ పాటను విడుదల చేశాడు. ఇక 'శంకరాభరణం' చిత్రంలోనూ పవన్ నామస్మరణ బాగానే చేశారు. ఇక తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'బెంగాల్‌టైగర్'లో కూడా పవన్ నామజపం బాగా కనిపించింది. రజనీ కంటే పవన్‌ని గొప్పవాడిని చేశాడు సంపత్ నంది. ఇలా ఆయనపై తనకున్న అభిమానాన్ని సరిగ్గా వాడుకున్నాడు. ఇక నితిన్‌తో పోటీగా తన తాజా చిత్రంలో సాయిధరమ్‌తేజ్ పవన్‌ను విపరీతంగా వాడుకోబోతున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం.