చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను ఆదుకునే దిశగా పెద్ద సినిమాల ఆగడాలకు కళ్లెం వేసే దిశగా నిర్మాతల మండలి తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్న తేదీన విడుదల చేయాలని, ఒకవేళ అప్పుడు విడుదల వీలుపడకపోతే కనీసం నాలుగు వారాలు వాయిదా వేసుకోవాలనే కీలక నిర్ణయం ఇప్పుడు పెద్ద నిర్మాతలకు కునుకు లేకుండా చేస్తోంది. ఈమేరకు జనవరి 1, 2016 నుండి దీన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్యకాలంలో కొన్ని పెద్ద సినిమాలు ఇష్టం వచ్చినట్లుగా రిలీజ్ డేట్లను మారుస్తూ వాయిదాలు వేశారు. దాంతో చిన్న సినిమాల రిలీజ్ షెడ్యూల్ అస్తవ్యస్తం అయి తీవ్రంగా నష్టపోయారు. 'బాహుబలి, శ్రీమంతుడు, రుద్రమదేవి, అఖిల్' వంటి సినిమాల రిలీజ్ ఎన్ని సార్లు వాయిదా పడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలు నష్టపోవడంతో పాటు ప్రేక్షకుల్లోనూ అయోమయం నెలకొంది. రిలీజ్ డేట్ల విషయంలో కొందరు పెద్ద నిర్మాతలు క్రమశిక్షణగా మెలగకపోవడం ఇందుకు కారణం. వారి కారణంగా చిన్న సినిమాలు రిలీజ్ డేట్స్ దొరకక ఇబ్బంది పడడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా చిన్ననిర్మాతలు నష్టపోవాల్సివచ్చింది. ఇలాంటి నిబంధనలు బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో మంచి ఫలితాలనే అందించాయి. టాలీవుడ్‌లో కూడా ఇవి అమలులోకి రావడం హర్షణీయం అంటున్నారు. మరి ఈ కొత్తనిబంధనలు ఏమేరకు విజయవంతంగా అమలు అవుతాయో వేచిచూడాలి...!