సినిమా యాపారం సాపీగా సాగాలంటే కథ, కథనాలు తరువాత. వాటికంటే ముందుగా సొమ్ములు పెట్టె నిర్మాత, ఆ నిర్మాతకి ఫైనాన్శియర్స్ నుండి సపోర్ట్ లభించాలన్నా హీరో-దర్శకుడు కాంబినేషన్ మీదే అన్ని లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఇది చూడండి. జూనియర్ ఎన్టీయార్ తన కెరీర్లోనే ఇప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్నాడు. గడ్డురోజులకు స్వస్తి పలుకుతుంది అనుకున్న టెంపర్ నామమాత్రానికి అన్నట్టుగా అటు ఫట్టు, ఇటు హిట్టు కాకుండా తారక్ పరిస్థితిలాగే ఖతం అయింది. ఇక ఆశలన్నీ సుకుమార్ రాసిన నాన్నకు ప్రేమతో మీదే పెట్టుకున్నాడు బుడ్డోడు. నెలల తరబడి ఫారెన్ దేశాల్లో షూటింగ్ చేసుకొచ్చిన ఈ సినిమాకు ఇంకా చాలా ఏరియాలలో బిజినెస్ క్లోజ్ అవలేదు అంటే ఆశ్చర్యం వేయకమానదు. దీనిక్కారణం నిర్మాత ప్రసాద్ గారు గొంతెమ్మ కోర్కెల్లాగా ఎక్కడ లేని రెట్లు చెప్పడమే అంటున్నాయి వ్యాపార వర్గాలు. పైగా సుక్కు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం నేనొక్కడినే దిక్కు లేకుండా పోవడం శనిలాగా పట్టుకుంది. విచిత్రంగా ఎన్టీయార్ ఒప్పుకున్న మరో సినిమా జనతా గ్యారేజీకి మాత్రం ఇంకా ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవకుండానే బిజినెస్ క్లోజ్ అయిందట. దీనికి పెద్ద రీజన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనతా గ్యారేజీ దర్శకుడు కొరటాల శివ నిన్నే మహేష్ బాబుకు శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కాబట్టి తారక్-సుక్కుల మీద నమ్మకం కన్నా తారక్-కొరటాల మీద అమ్మకమే గట్టిదని ప్రూవ్ అయింది.