ఇదివరకు చేసిన తప్పుల్ని మళ్లీ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు నాని. యేడాదికొక సినిమా చేసి... తీరా దానికి విడుదల విషయంలో కష్టాలు ఎదురైతే ఎన్ని పాట్లు పడాల్సి వుంటుందో నానికి కొన్ని సినిమాలు అనుభవాన్నిచ్చాయి. అందుకే ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకొని యేడాదికి రెండు మూడు సినిమాలైనా చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలోనే తన నిర్ణయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు ఆచరణలోనూ పెట్టాడు. భలే భలే మగాడివోయ్ సినిమా సెట్స్‌పై ఉండగానే జై బాలయ్యని మొదలుపెట్టాడు నాని. అది సెట్స్‌పై ఉండగానే మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాకి ఓకే చెప్పాడు. ఆ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఇంతలోనే మరో కొత్త సినిమాకి ఓకే చెప్పేశాడు నాని. ఉయ్యాలా జంపాలాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మతో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఆ చిత్రాన్ని జెమినీ కిరణ్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అంటే నాని ఇక నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయబోతున్నాడన్నమాట. ఇదివరకటిలా ప్రేక్షకులు నాని సినిమాకోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదన్నమాట. అయితే నాని భలే భలే మగాడివోయ్‌తో స్టార్ లీగ్‌లోకి వెళ్లిపోయాడు. ఆ చిత్రం దాదాపుగా 35కోట్లపైనే వసూళ్లు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో ఇక నాని కూడా మాస్ మంత్రం జపిస్తాడని, మాస్ దర్శకులతో భారీ సినిమాలు చేసేస్తాడని ఊహించారంతా. కానీ ఎప్పట్లాగే తనదైన శైలిలో కథాబలమున్న చిత్రాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. చిన్న చిత్రాలతోనే పెద్ద విజయాలు సొంతం చేసుకోవాలన్న వ్యూహంతో ఆయన ముందుకెళుతున్నట్టు అర్థమవుతోంది.