సెటైర్లు వేయడానికి కూడా సమయం, సందర్బం ఉంటాయి. ఒక పక్క చెన్నై సంద్రంగా మారి లక్షలాది మంది కాస్త కరుణ చూపమని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా తమకు తోచిన సాయం చేస్తూనే ఉంది. కానీ ఇలాంటి సమయంలో కనీసం మానవత్వం లేని వర్మ దేవుళ్లపై సెటైర్లు వేస్తూ.. తోటి వారిపై వంకరగా మాట్లాడుతూ తన వికృతానందం తీర్చుకుంటున్నాడు. ఈ విపత్తు దేవుడే చేశాడు.. ఆయన ఓ ఉగ్రవాది.. దేవుడు వెన్నుపోటదారుడు అంటూ వెటకారం చేస్తూ ట్వీట్లు చేస్తున్నాడు. మరో పక్క తమకు తోచిన సాయం చేస్తున్నవారికి తనవంతుగా ఏమి చేయకుండా నటీనటులను, స్టార్స్‌ను ఎగతాళి చేస్తూ సెటైర్లు వేస్తున్నాడు. వందల కోట్లను సంపాదించిన స్టార్స్ లక్షల్లో ముష్టి వేస్తున్నారని, ఆ ముష్ఠి వేయడం కంటే వేయకపోవడమే మంచిది అంటూ తనకు తోచినట్లు ట్వీట్స్ పెడుతున్నాడు. ఈ వర్షాలు ఆపడానికి రజనీకాంత్ ఏమీ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యంగ్య్కాస్తాలు సందిస్తున్నాడు. మరి లారెన్స్ ఏకంగా కోటిరూపాయలను విరాళంగా ఇచ్చిన సంగతిని వర్మ మరిచాడేమో...! మరి ఇంతకీ తన వంతుగా తానేమి చేశాడు? అనేది వర్మ తనను తాను ప్రశ్నించుకుంటే మంచిదని కొందరు ఆయనపై విరుచుకుపడుతుంటే మరికొందరు మాత్రం వర్మ చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉండవచ్చు గానీ వాటిని ట్వీట్ చేయడానికి ఇది సరైన సందర్భంగా కాదని మండిపడుతున్నారు. కుక్కతోక వంకర అని పెద్దలు ఊరకే చెప్పలేదు అనే విషయం వర్మను చూస్తేనే అర్థం అవుతోంది.