బ్రూస్ లీ అంటే శ్రీను వైట్ల మీద నిందేసి తప్పుకున్నావ్. అఖిల్ అంటే నావి కేవలం మాటలే అంటూ తుర్రుమన్నావ్. త్రిపుర అంటే మొహం తిప్పకుండా తడబడ్డావ్. అన్నింటికీ రేపు శంకరాభరణం సక్సెస్ మీటులో సమాధానం ఇస్తా అంటూ మీడియా ముందు బీరాలు పలికావ్. మరి ఇదేంటి కోన, ఉన్నది ఉన్నట్టుగా హిందీ హిట్ సినిమా ఫస్ గయా రే ఒబామాను తెలుగీకరించమన్నా ఇలా తుస్సుమన్నావ్.
వాట్ ద ఫిష్ అంటూ నిఖిల్ మొదలెట్టగానే ఇది ఫినిష్ అని తేలిపోయింది. బట్, ఏదో ఓ మూలన మా కోన మళ్ళీ కొన ఊపిరి మీదనైనా సినిమాను లేపకపోతాడా అని ఆశపడడం భంగపాటే అయింది. ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన మీ అపూర్వ అనుభవం ఏమైంది. కనీసం మనం డీల్ చేస్తున్న పాత్రల స్వభావాలు, ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, కథా విస్తరణ... ఇలాంటి ఫండమెంటల్ అంశాలను కూడా మరిచిపోయి అలనాటి చిత్రరాజం శంకరాభరణం పేరును అతి సులువుగా చెడగొట్టావని రేపు క్రిటిక్స్ దుయ్యబడతారన్న భయాన్ని కూడా వదిలేసినట్టున్నావ్.
స్టార్ హీరోలైన మహేష్ బాబు లాంటి వారు, స్టార్ దర్శకులైన శ్రీను వైట్లలాంటి వారు కూడా ఇప్పుడున్నది మన కోననేనా అని కన్ఫ్యూజ్ అయ్యే స్థాయిలో మీ పనితనం పడిపోయిందంటే నిజంగా నమ్మలేని పరిస్థితి. మేం తీసిందే కామెడీ, మేం చూపిందే తెలుగు సినిమా దారి అని నమ్మబలికే రోజులు పోయాయి. తిన్నగా తీయకపోతే రామ్ చరణ్ లేడు, అఖిల్ లేడు... అలా అని నిఖిల్ కూడా లేడు, అందరినీ తిప్పి పంపుతాం అని సామాన్య సినిమా ప్రేమికులు గట్టిగా చాటి చెప్పే రోజులొచ్చాయి. రోత కామెడీలను ఆదరించడం నుండి తెలుగు ఆడియెన్సు శైలి మారింది. మన కోనలో కూడా ఆ మార్పు వస్తేనే మళ్ళీ అతని బ్రాండ్ వ్యాల్యూ నిలిచేది లేకుంటే ఇక సరిగమపదనీ...