అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఆయన నటిస్తున్న 'అఖిల్' సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉండేవి. వినాయక్ దర్శకుడు కావడం, నితిన్ నిర్మాతకావడంతో ఈ అంచనాలు మరింత ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో జెమిని చానెల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను ఏడు కోట్లకు కొనడానికి ముందుకు వచ్చింది. కానీ నిర్మాతలు నితిన్, సుధాకర్‌రెడ్డిలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మరింత రేటు వస్తుందని ఆశపడి 8కోట్లకు ఒక్క పైసా తగ్గినా ఇచ్చేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత పరిస్థితి రివర్స్ అయింది. సినిమా మొదటి షో నుండే ప్లాప్‌టాక్ తెచ్చుకోవడంతో నిర్మాతలు నితిన్, సుధాకర్‌రెడ్డిలు తీవ్రమైన నష్టాల పాలయ్యారు. సినిమా ఫ్లాప్ ప్రభావం శాటిలైట్ రైట్స్ మీద కూడా పడింది. అప్పుడు ఏడుకోట్ల ఆఫర్ చేసిన జెమినీ చానెల్ వారు సినిమా కొనడానికి ఇష్టపడటం లేదు. కనీసం రెండు కోట్లయినా ఇవ్వాలని నిర్మాత అడిగారట. అంత ఇవ్వలేమని చెప్పిన జెమినీ యాజమాన్యం కేవలం 70లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేమని తేల్చివేశారు. ఏడుకోట్లకు కొంటానని వచ్చినప్పుడు అమ్మి ఉంటే నిర్మాతలకు ఎంతో కొంత ఊరట కలిగేది. అప్పుడు అఖిల్ పొంగు చూసి పొంగిపోయిన నిర్మాతలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారని సమాచారం.