రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాందించుకున్న కోనవెంకట్ దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేదు. 2008లో ఓ చిత్రానికి దర్శకత్వం వహించిన కోన ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. రచయితగానే బిజీగా వున్న ఆయన అప్పుడప్పుడు ప్రాజెక్టులు సెట్ చేసి సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా కోనవెంకట్ సమర్పకుడిగా, రచయితగా రూపొందిన చిత్రం ‘శంకరాభరణం’. నిఖిల్, నందిత జంటగా నటించిన ఈ చిత్రానికి కోన రచయితగానే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ అని కూడా టైటిల్స్ కార్డ్స్‌లో వేయించుకుంటున్నాడు. ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా వుంటుందని ఈ రచయిత బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అయితే ఈ చిత్రం ఒకవేళ హిట్ అయితే దర్శకత్వం కూడా తానే చేశానని.. కాకపోతే.. ఆ ఫెయిల్యూర్‌ను ఉదయ్ మీద రుద్దడానికి కోన రెడీ అయ్యాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతేకాదు ఇటీవల కోన పత్రికలతో మాట్లాడుతూ ‘శంకరాభరణం’ తర్వాత ఇక ఘోస్ట్ డైరెక్షన్ చేయనని కూడా చెప్పాడు.. అంటే ఈ చిత్రానికి తనే డైరెక్టర్ అని పరోక్షంగా చెప్పాడు. గతంలో మారుతి కూడా ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి రచయితగా పనిచేసి సినిమా హిట్టవ్వగానే.. చిత్రానికి తనే దర్శకత్వం వహించానని, కొన్ని పరిస్థితుల కారణంగా దర్శకుడిగా ప్రభాకర్‌రెడ్డి పేరు వేయాల్సి వచ్చిందని పత్రికల వారితో ఓపెన్‌గా చెప్పాడు.. సో.. శంకరాభరణం విషయంలో కూడా సినిమా హిట్టయితే ‘ప్రేమకథా చిత్రమ్’ సీనే రిపీట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.