టాలీవుడ్‌లో మంచి స్థాయిలో పేరున్న పలువురు స్టార్స్‌తో పాటు కొందరు కుర్రహీరోలు ఫ్లాప్‌లు ఎదుర్కొంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం తమ సత్తాను చాటుతూ వరుస చిత్రాలతో బిజీగా మారిపోయి రాబోయే కాలంలో కాబోయే స్టార్స్‌గా ఎదుగుతున్నారు. నాని విషయానికి వస్తే తన కెరీర్‌లో ఎవరి అండదండలు లేకపోయినా తనకున్న టాలెంట్‌తో నేచురల్ స్టార్‌గా పిలవబడుతూ ఒడిఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఈ హీరోకు 'జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం' వంటి చిత్రాలు కాస్త ఊరట ఇచ్చినా.. ఆ తర్వాత వచ్చిన 'భలే భలే మగాడివోయ్'తో ఒక్కసారిగా ఆయన జాతకం మారిపోయి 30కోట్ల క్లబులో చేరిపోయాడు. ఎడాపెడా సినిమాలు ఒప్పుకోకుండా తనదైన శైలిలో చిత్రాలు చేసుకుంటున్నాడు. ఇక 'ఉయ్యాల జంపాల' చిత్రంతో పాటు 'సినిమా చూపిస్త మావ' సినిమా కూడా మంచి విజయం సాధించడం, తాజాగా సుకుమార్ సమర్పణలో వచ్చిన 'కుమారి 21ఎఫ్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో కోటి రెమ్యూనరేషన్‌ను దాటి తనదైన రూటులో దూసుకుపోతున్న మరో యంగ్‌హీరో రాజ్‌తరుణ్. ఇక విభిన్నచిత్రాలను నమ్ముకొని వరస విజయాలు సాధిస్తున్న నిఖిల్ కూడా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. రేపు విడుదలకానున్న 'శంకరాభరణం' కూడా మంచి విజయం సాధిస్తే ఇక నిఖిల్ స్పీడ్‌కు బ్రేకులుండవనే చెప్పాలి. ఈ లిస్ట్‌లోకి శర్వానంద్ కూడా వస్తాడు. కాగా సందీప్‌కిషన్, వరుణ్ సందేశ్ నుండి అల్లరి నరేష్, సునీల్ వరకు ఎందరో హీరోలు తమ కెరీర్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎలాంటి చిత్రాలు చేయాలో అర్ధంకాక సతమతమవుతుంటే ఈ కుర్రహీరోలు మాత్రం ఎవరి అండదండలు పెద్దగా లేకపోయినా ఆచితూచి అడుగులు వేస్తూ తమ రూట్‌లో రయ్‌మని దూసుకెళ్లుతూ భవిష్యత్తు స్టార్స్‌గా ఎదుగుతున్నారు.