హృదయ కాలేయంతో టాలీవుడ్‌లో తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన సంపూర్ణేష్‌బాబు చేసింది కొన్ని సినిమాలే అయినా ఈరోజు ఒక మంచి పని చేయడం ద్వారా రియల్ హీరో అనిపించుకున్నాడు. అదెలాగంటే తమిళనాడులో వరదల బీభత్సంతో 9 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చెన్నయ్ మహానగరం సముద్రంగా మారిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఈ వరదల వల్ల ఎన్నో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ, ఈరోజు ఆ ఉద్ధృతి మరింత ఎక్కువైంది. దీనికి స్పందించిన తమిళ ఇండస్ట్రీలోని హీరోలు ఒక్కొక్కరుగా స్పందించడం మొదలు పెట్టారు. రజనీకాంత్ 10 లక్షలు, సూర్య, కార్తీ 25 లక్షలు, విశాల్ 10 లక్షలు.. ఇలా ఎవరి స్టేటస్‌కి తగ్గట్టుగా వాళ్ళు విరాళాలు ప్రకటించి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు.
ఇదిలా వుంటే టాలీవుడ్‌లో మాత్రం ఈరోజు ఉదయం వరకు ఎలాంటి స్పందన లేదు. మొట్ట మొదటగా సంపూర్ణేష్‌బాబు తమిళనాడు వరద బాధితుల కోసం 50 వేల రూపాయలు విరాళం ప్రకటించడం ద్వారా శ్రీకారం చుట్టాడు. సంపూ స్టేటస్‌కి, అతనికి వచ్చే ఆదాయానికి 50 వేల రూపాయల సాయం అందించడం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత అతన్ని అనుసరిస్తూ టాలీవుడ్ హీరోలు తమతమ విరాళాలను ప్రకటించడం ప్రారంభించారు. అల్లు అర్జున్ 25 లక్షలు, మహేష్ 10 లక్షలు, ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్‌రామ్ 5 లక్షలు, రవితేజ 5 లక్షలు, వరుణ్‌తేజ్ 3 లక్షలు, 3జి లవ్ నిర్మాత ప్రతాప్ కోలగట్ల లక్ష రూపాయలు.. ఇలా అందరూ సంపూర్ణేష్‌బాబుని ఫాలో అవుతూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టిన సంపూర్ణేష్‌బాబు ఈ విధంగా రియల్ హీరో అనిపించుకున్నాడు.