తమిళనాడును నట్టేట ముంచేస్తున్న వరదలతో అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తం అయింది. ప్రయాణ రాకపోకలు, ఆహార సౌకర్యాలు, విద్యుత్; అన్నింటా తీవ్ర అసౌకర్యంతో జన జీవనం స్తంభించి పోయింది. గత వంద, రెండు వందల ఏళ్ళుగా చెన్నై నగరాన్ని తాకిన అతి పెద్ద విపత్తుగా దీన్ని పరిశోధకులు భావిస్తున్నారంటే, నష్టం ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ముఖ్య మంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరినప్పటికీ, పొరుగునే ఉన్నాం కాబట్టి మన తెలుగు రాష్ట్రాలు కూడా తగిన సమయంలో సహాయ సహకారాలు తప్పకుండా అందించుకోవాలి. తమిళ నడిగర్ సంఘం నటీనటులందరూ తమకు తోచినంతగా ముఖ్య మంత్రి సహాయ నిధికి విరాళాలు సమర్పించిన సంగతి విదితమే. తాజాగా నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ తమ వంతుగా 15 లక్షల విరాళాన్నిసహాయ నిధికి అప్పగించారు. చెన్నై నగరాన్ని ఈ విధంగా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని, ఎవరికీ తోచినంతగా వాళ్ళు తమిళ నాడు ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలని వారిరివురూ తెలుగు ప్రజలను కోరారు.