పవన్ కళ్యాణ్, వెంకటేష్ హీరోలుగా ఓహ్ మై గాడ్ అనే హిందీ చిత్రాన్ని తెలుగులోకి మక్కీ కి మక్కీగా రీమేక్ చేసి వదిలిన గోపాల గోపాల గురించి మన అందరికీ తెలిసిందే. డాలీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ నటనతో ఆయన అభిమానులు ఆనందించినా నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరార్ అంతలా లాభపడింది ఏమీ లేదు. అలాగే వెంకటేష్ కెరీరుకు కూడా ఈ మూవీ ఏమీ ఉపయోగపడలేదు. వెంకటేష్, పవన్ కాంబినేషన్ అంటే కనీసం ఓ అరవై డెబ్బై కోట్ల వరకు వసూల్ చేసే స్థాయిలో ఉంటుందనుకున్న వారికి ఇది వీలైనంత తొందరగా మరిచిపోయే సినిమా బాపతు కిందే ఉండిపోయింది. అంతే కాకుండా గోపాల గోపాల ఎంతటి శాపంగా మారిందంటే దీని తరువాత ఇంతదాకా వెంకటేష్ నుండీ, పవన్ కళ్యాణ్ నుండీ ఇంకో సినిమా రాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్, రాధా అంటూ మొదలెట్టినా ఈ ఇద్దరు హీరోల నుండి ఆ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. దర్శకుడు డాలీది అదే పరిస్థితి. బ్యాడ్ సెంటిమెంట్ అంటే బహుశా ఇదేనేమో. నాస్తికత, దేవుడు సబ్జెక్టు మీద తీసిన ఈ చిత్రం అందరికీ పెద్ద దెబ్బేసింది!