రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన బెంగాల్ టైగర్ సినిమా చివరి అంకమైన సెన్సార్ బోర్డును కూడా అధిగమించేసింది. పూర్తి కమర్షియల్ చిత్రంగా మొదటి నుండి పకడ్బందీ కార్యాచరణతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దిగ్విజయంగా ముగించుకున్న బెంగాల్ టైగర్ పరిశ్రమలోని అందరు నిర్మాతలకు మంచి జరగాలన్న ఆలోచన దృష్ట్యా విడుదలలో రెండు, మూడు వారాల జాప్యంతో వెనక్కి జరిగింది. ఇక డిసెంబర్ 10న విడుదల తేదిని అనుసరిస్తూ ఈరోజు సెన్సార్ సభ్యుల ముందు చిత్రం ప్రదర్శింపబడింది. అందరూ అనుకున్నట్లుగానే U/A సర్టిఫికేటును సంపాదించింది. మాస్ మసాలా చిత్రం, అందునా హీరోయిన్ తమన్నా, రాశి ఖన్నాలు పాటల్లో రెచ్చిపోయి పిచ్చెక్కించిన తీరు, అలాగే మాస్ మహారాజా వీరోచిత యాక్షన్ విన్యాసాలు ట్రైలరులో చూసేసాం గనక, మిగిలింది విందు భోజనం ఆరగించడమే. అందుకేనేమో బెంగాల్ టైగర్ వీక్షించిన సెన్సార్ సభ్యులు అటు నిర్మాత రాధా మోహన్ గారిని, ఇటు దర్శకుడు సంపత్ నందిని, హీరో రవితేజని ప్రశంసించకుండా ఉండలేక పోయారట.