భర్తల వీర్యకణాల్లో సత్తువలేని కారణంగా భార్యలకు సంతానం కలగకుండా పోతున్నఈ యుగంలో, పెరిగిపోయిన ఆధునికతను ఉపయోగించుకొని ఫర్టిలిటీ క్లీనిక్స్ ప్రోత్సహించే స్పెర్మ్ బ్యాంక్ కాన్సెప్టు మీద 2012లో బాలివుడులో వచ్చిన విక్కీ డోనార్ అనే కామెడీ డ్రామా సినిమా మంచి విజయం సాధించింది. ఇదే కథను తెలుగులో తీయడానికి ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న మధురా శ్రీధర్ రెడ్డి మరోసారి మరుగున పడిపోయిన పాత స్క్రిప్టును బయటికి తీస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ శ్రీధర్ రెడ్డి నిర్మించబోయే ఈ ప్రాజెక్టు నెలాఖరుకి పట్టాలెక్కబోతోంది. వీర్య కణాల మీద కథ అవడంతో ఇంతటి బోల్డ్ నెస్ మన తెలుగు ప్రజలకు అర్థమవుతుందా అన్న మీమాంసలో ఉన్నశ్రీధర్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు సాధిస్తున్న విజయాలతో నమ్మకం బాగా పెరిగింది. ముఖ్యంగా కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని జనాలు ఆదరించిన విధానం చూస్తే విక్కీ డోనార్ కూడా మంచి కాన్సెప్టే అనిపించక మానదు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌథమ్, అన్నుకపూర్ చేసిన ముఖ్య పాత్రలలో ప్రస్తుతానికి సుమంత్ అశ్విన్, రావు రమేష్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరో హీరోయినుగా ఎవరిని ఎంచుకుంటారా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.