బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే నందమూరి అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. ఆ ఊగటానికి తగ్గట్టుగానే బోయపాటి వారు సింహా, లెజెండ్ చిత్రాలతో బాలకృష్ణకు పునర్వైభవం కల్పించారు. ఈ జనరేషన్ దర్శకుల్లో బాలయ్యలోని సత్తాను సరిగ్గా అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగానే కథా, కథనాలు తయారు చేసే దర్శకుల్లో బోయపాటిని మించినోడు లేడు. అందుకే నటసింహం నూరవ సినిమా బాధ్యతలకు సరైనోడుగా భావించి బోయపాటి మీదే భారం వేసారు. వచ్చే ఏడాది మధ్యలో మొదలవునున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. లెజెండ్ సినిమాలో కథానాయకుడు బాలకృష్ణతో పోటాపోటీ ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు అత్యద్భుతంగా అలరించాడు. హిస్టరీ రిపీట్ చేసే క్రమంలో బాలకృష్ణ నూరవ చిత్రానికి కూడా జగపతిబాబు విలనుగా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ ఆలోచనకి అనుగుణంగా బోయపాటి కథను కూడా తయారు చేస్తున్నాడని, ఇందులో జగపతి పాత్రకి అత్యంత శక్తివంతంగా చెక్కుతున్నాడనీ వినికిడి. అన్నీ కలిసొస్తున్నాయి కాబట్టి... చరిత్ర తిరగరాయడం ఖాయం...