స్టార్‌హీరోల సొంత గొంతుతో సినిమాలో కనీసం ఒక్క పాటైనా పాడిస్తే అభిమానులకు వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. ఆ ఒక్క పాట కోసం సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోవడం వాస్తవమే. గతంలో పవన్‌కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కొన్ని చిత్రాల్లో తమ సొంత గొంతుతో పాటలు పాడి మెప్పించారు. కాగా స్టార్ హీరోల చేత మంచి కిక్ ఇచ్చే పాటలను పాడించడంలో దిట్ట దేవిశ్రీప్రసాద్. తాజాగా ఆయన పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్', ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలలోనూ ఆయా స్టార్స్ చేత ఓ పాట పాడించి ఆల్బమ్‌కు పరిపూర్ణత లభించేలా చేయాలని దేవిశ్రీ భావిస్తున్నాడట. కాగా ఈ విషయంపై దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ... స్టార్స్‌తో పాటలు పాడించాలని ప్లాన్ ప్రకారం చేయడం ఉండదు. ఏదో ఆ టైమ్‌కి అలా కుదురుతుందంతే.. అని చెప్పుకొచ్చాడు. గతంలో ఆయన పవన్ చేత 'అత్తారింటికి దారేది' చిత్రంలో 'కాటమరాయుడా..' అనే పాటను, ఎన్టీఆర్ చేత 'అదుర్స్' చిత్రంలో ఎన్టీఆర్ చేత ఓ పాటకు హమ్ చేయించాడు. ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాదించాయి. సో.. ఈ రాబోయే రెండు చిత్రాలు కూడా అదే సెంటిమెంట్‌తో సూపర్‌హిట్ అవుతాయని వారి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు.