సాధారణంగా కేవలం తన చిత్రాలనే కాకుండా బాగున్న ప్రతి చిత్రాన్ని చూసి బాగుంటే అభినందించి మంచి పబ్లిసిటీ చేయడం దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న సుగుణం. అంతేకాదు.. తన అనుకున్న వారికి చిత్రీకరణ సమయంలో ఏవైనా అనుమానాలు ఉంటే వారికి తగిన సమయం కేటాయించి మరీ తన వంతు సహాయం చేస్తాడు. ఇప్పుడు అదే పనిని 'సైజ్‌జీరో' చిత్రానికి చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'సైజ్‌జీరో'ని ఇటీవల రాజమౌళికి చూపించారట. దాంతో ఆయన ఈ చిత్రంలో పలు మార్పులు చేర్పులు సూచించాడని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, ఆయన తన గురువైన రాఘవేంద్రరావు తనయుడు కావడం, అంతేగాక ఈ చిత్ర నిర్మాత పివిపితో ఉన్న సాన్నిహిత్యం, తన 'బాహుబలి' కథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం కావడం.. ఇలా పలు అంశాలు ఆయన్ను ఈ పని చేయడానికి ప్రేరేపించి ఉంటాయని అంటున్నారు. మరి రాజమౌళి చెప్పిన మార్పులు, చేర్పులు ఈ సినిమా విజయానికి ఎంత వరకు ఉపయోగపడ్డాయి? అనేది వేచిచూడాల్సిన అంశం.