జీవితం అందరి సరదా తీర్చేస్తుంది అని పూరి జగన్నాథ్ చెప్పినట్టు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ జీవితం కూడా అతని సరదా తీర్చేస్తోంది. దేశంలో అనిశ్చితి నెలకొందనీ, ఈ దేశంలో జీవించాలంటేనే భయంగా వుందని, ఈ దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళిపోవాలని తన భార్య కోరుకుంటోందని చెప్పుకొచ్చిన అమీర్‌ఖాన్‌కి దేశవ్యాప్తంగా వివిధ మీడియాల ద్వారా చెప్పు దెబ్బల కంటే పదునైన మాటలతో అతని సరదా తీర్చేస్తున్నారు. ఒక పక్క బాలీవుడ్ సెలబ్రిటీస్, మరో పక్క రాజకీయ నాయకులు, ఇంకో పక్క అతని ఫ్యాన్స్ ఉతికి ఆరేస్తున్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అతని వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ఈ దేశంలో పుట్టి, ఇక్కడి ప్రజల ఆదరణతో స్టార్‌గా ఎదిగిన అమీర్‌ఖాన్‌కి ఇదేం పోయేకాలం అని నెత్తి, నోరు బాదుకుంటున్నవారు కూడా వున్నారు. మరోపక్క అతన్ని సమర్థిస్తున్నవారు కూడా లేకపోలేదు. అది వేరే విషయం.
120 కోట్లకుపై జనాభా వున్న భారతదేశంలో అమీర్‌ఖాన్ కుటుంబానికే మత అసహనం కనిపిస్తోందా? గతంలో ఎన్నో మత ఘర్షణలు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమధ్య అలాంటి మత ఘర్షణలు లేవు. కేవలం ఉగ్రవాదం వల్లే కొన్ని సంఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తప్ప మత అసహనం వల్ల కాదు. బాలీవుడ్‌ని అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్‌ఖాన్ వంటి ముస్లిం హీరోలు ఏలుతున్నారు. ఇండియా క్రికెట్ టీమ్‌కి అజహరుద్దీన్ కెప్టెన్‌గా ఎన్నో సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించాడు. అదే పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశంలో ఒక హిందువు క్రికెట్ కెప్టెన్ అవ్వగలడా? పాకిస్థాన్‌లో హిందువు స్టార్ హీరో అవ్వగలడా? అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు అలా జరగనిస్తాయా?
తను నటించిన సినిమాల ద్వారా అందరికీ వినోదాన్ని పంచిన అమీర్‌ఖాన్ కొన్ని టి.వి. ప్రోగ్రామ్స్ ద్వారా, కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవేర్‌నెస్ తెచ్చేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే అవన్నీ డ్రామాలనీ, పాపులారిటీ సంపాదించుకునేందుకు, మంచివాడినని ముద్ర వేయించుకునేందుకు అమీర్ వేసిన ప్లాన్ అని అతన్ని అభిమానించేవారే అవహేళన చేస్తున్నారు. పైకి మంచి తనం నటించే అమీర్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని చీకటి కోణాన్ని కూడా బయటికి లాగుతున్నారు. మొత్తానికి అమీర్ వ్యాఖ్యల వల్ల రేగిన దుమారం ఇప్పట్లో ఆగేట్టు లేదు. ఏది ఏమైనా జీవితం అందరి సరదా తీర్చేస్తుంది అనే మాట అమీర్‌ఖాన్ విషయంలో అక్షరాలా నిజమైందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.