ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించని భిన్నత్వంలో ఏకత్వం, మన భారత దేశం సొంతం. అలాంటి దేశంలో పుట్టి పెరిగి, ఎనలేని పేరు ప్రఖ్యాతలు, సంపద మూటగట్టుకొని స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఆమీర్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడి మత అసహనం గురించి వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దేశంలో పెరిగిపోతున్న మత అసహనంతో తాను, తన భార్య కిరణ్ విసిగిపోయామని, అందుకే పుట్టిన కొడుకుని జాగ్రత్తగా ఎలా పెంచి పెద్ద చేయాలని అనుక్షణం భయపడుతూ ఇక్కడే భారతదేశంలో అభద్రతతో ఉండాలా లేక వేరే దేశానికి ఎక్కడికైనా వెళ్లిపోవాలా అనేంతగా అంతర్మధనం చెందామని ఆమీర్ చెప్పడం నిజానికి అందరిలోనూ ఆందోళన కలిగించింది. ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో జరిగిన దాడులకు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తాకిడికి, ఇక్కడ మన దేశం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది అనడం ఆమీర్ మూర్ఖత్వమే అవుతుంది. ఇలాంటి పరిస్థితి అంతర్జాతీయంగా భాదాకరమే అయినా ఆమీర్ అంత తేలిగ్గా భరతమాత ఒడిని వీడి పరాయి దేశం వెళ్లిపోవాలన్న ఊహను వెలిబుచ్చడం ఆయన అభిమానులను సైతం చిన్నబుచ్చింది.