నిన్న మొన్నటి వరకు కూడా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు పూర్తి స్థాయి కామెడీ చిత్రాలను తీసి ప్రేక్షకులందరికీ వినోదాలు పంచిపెట్టారు. సీనియర్ నరేష్, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ వంటి హీరోలతో పూర్తి స్థాయి కామెడీ చిత్రాలను తీసి మెప్పించారు. అంతేకాదు... స్టార్ హీరోలుగా ముద్రపడిన తర్వాత కూడా ఎన్టీఆర్, కృష్ణ, నాగేశ్వరరావు, శోభన్‌బాబు, చిరంజీవి, వంటి హీరోలతో కూడా వారు కామెడీ చిత్రాలు తీసి మెప్పించారు. కానీ టాలీవుడ్‌కి మాత్రం రాజేంద్రప్రసాద్ తర్వాత ఆస్థాయి కామెడీ హీరోలు రాలేదు. కొంతకాలం కిందట అల్లరినరేష్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అందరూ భావించారు. కానీ ఆయనతో అద్బుతమైన కామెడీ చిత్రాలను తీయగలిగే దర్శకులే దొరకకుండా పోయారు. కెరీర్ మొదట్లో సునీల్ హీరోగా మారిన తర్వాత ఆయన నుండి కూడా రెండూ మూడు మంచి కామెడీ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత మాత్రం సునీల్ కూడా ప్రేక్షకులను నవ్వించలేకపోతుండటం బాధాకరం. పూర్తిస్థాయి కామెడీ చిత్రాలు అంటే అది తెలుగువారికే సాధ్యం అని పేరుండేది. కానీ అవి ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. మాస్, యాక్షన్, హర్రర్ వంటి చిత్రాలలోనే కామెడీ మిళితం చేయడం, లేదా సైడ్ ట్రాక్‌లు వాడుకోవడం మినహా మన దర్శకులు కామెడీ సినిమా అంటేనే భయపడిపోతున్నారు. నవరసాల్లో కష్టమైనది నవ్వు అని తెలిసి వాటిని ఏదో తూతూ మంత్రంగా, ఆటలో అరటిపండు తరహాలో వాడేసుకుంటున్నారు. దీంతో తెలుగు కామెడీ సినిమా రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.