గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడానికి హీరోగా రామ్ చరణ్ ఎంత కారణమో అతను ఎంచుకున్న కథలు, దర్శకులు కూడా అంతే కారణమని చెప్పుకోవాలి. దర్శకుడిగా కృష్ణ వంశీ పొజిషన్ ఎంతటి దిగువ స్థాయిలో ఉందో మనం మళ్ళీ విప్పి చెప్పుకోవాల్సిన పని లేదు అలాగే శ్రీను వైట్ల కూడా ఆగడులాంటి డిజాస్టర్ తీసిన తరువాత కూడా వెనువెంటనే రామ్ చరణ్ సినిమా దక్కిందంటే దానికి ఎటువంటి పెడార్థం తీయాలో తెలియటం లేదు. జరిగిన దారుణం నుండి తేరుకోవాల్సిన సమయంలో కిక్ 2తో రేస్ గుర్రం విజయాన్ని మురికి కాలువ పాలు చేసిన సురేందర్ రెడ్డితో, అదీను తని ఒరువన్ రీమేక్ కోసం జత కట్టడం రామ్ చరణ్ చేస్తున్న మరో తప్పుగా అభివర్ణిస్తున్నారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే తని ఒరువన్ తమిళ అమోఘ విజయానికి ప్రతినాయకుడిగా స్వైర విహారం చేసిన అరవింద్ స్వామీ ఒక్కడే కారణం. అంతే తప్ప సినిమాలో హీరో ఛాయలున్న జయం రవి నామమాత్రానికే ఉండిపోతాడు. కథనంలో అరవింద్ స్వామీకి ఇచ్చిన ప్రాముఖ్యత, అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బెస్ట్ అస్సెట్టుగా నిలబడ్డాయి. ఇంతటి స్క్రిప్టుని మళ్ళీ పునర్లిఖించినంత మాత్రాన తెలుగులో హీరోగా రామ్ చరణ్ పాత్రకు పెద్దగా ఒదిగేది ఏమీ ఉండకపోవచ్చు. కొత్త కథలను, కొత్తదనం ఉండే పాత్రలని వేటాడి పట్టుకోవాల్సిన తరుణంలో ఇలా పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్లుగా తని ఒరువన్ పైన పడడం చరణ్ బాబుకి మంచిది కాదేమో? గ్యాప్ తీసుకున్నా ఫర్వాలేదు గానీ సూపర్ హిట్టుతో రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.