ఫ్యామిలీ బ్యాకప్ లేదా గాడ్ ఫాదర్ లేకుండా సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయితే వాచిపోవడం ఖాయం. ఆర్టిస్టుగా అయినా సాంకేతిక వర్గంలో అయినా కొత్తగా జాయిన్ అవుతున్నవాళ్లకి అన్నీ కలిసొస్తే ఎప్పటికో గానీ గుర్తింపు రాదు. బీటెక్ కోర్సుని మధ్యలోనే డ్రాప్ చేసి సినిమాల మీదున్న పిచ్చితో తెలుగు పరిశ్రమలోకి దిగిపోయిన కుర్రాడు రాజ్ తరుణ్ మాత్రం అత్యంత తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. నేటితరం కుర్ర హీరోలలో ఇంత ఫాస్టుగా తెర మీదకి దూసుకొచ్చి అటు తరువాత యూతులో ఓ స్వంత ఐడెంటిటీ పొందిన రాజ్ తరుణ్ రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలతో చెలరేగుతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా అండ్ కుమారి 21 ఎఫ్ వంటి వరస హిట్లతో నిర్మాతలకు, దర్శకులకు కూడా లక్కీ మస్కట్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణుల ప్రాజెక్టులు సంతకాలు చేసేసి ప్రస్తుతానికి యమా బిజీగా ఉన్నాడు. ఈ మధ్యలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతోంది. డజను, అరడజను పైగా సినిమాలు చేసి ఎటువంటి మార్కెట్ ఏర్పరుచుకోకుండా మిగిలిపోయిన మిగతా హీరోల కన్నా రాజ్ తరుణ్ మీద పెట్టుబడి పెడితే ఎంతో కొంత సేఫ్ అన్న స్థాయికి నిర్మాతలు చేరిపోయారంటే ఇదీ ఓ అచీవ్మెంటే కదా...