అందరం ఒకే తాటిపై ఉన్నామని ఎవరెన్ని కబుర్లు చెప్పినా టాలీవుడ్‌లో మాత్రం కోల్డ్‌వార్ రోజురోజుకూ ముదురుతోంది. ఆమధ్య 'రుద్రమదేవి' విషయంలో 'బ్రూస్‌లీ' చిత్రంపైన దాసరి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీనికి రామ్‌చరణ్, అల్లుఅర్జున్‌లు సైతం సరైన సమాధానం ఇచ్చారు. ఇక అదే వేదికపై దాసరి మాట్లాడుతూ కేవలం ఆ నాలుగు ఫ్యామిలీల నుండే హీరోలు వస్తున్నారని సెటైర్లు విసిరాడు. దీనికి నిర్మాత డి. సురేష్‌బాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. టాలెంట్ ఉన్నవారే సినిమా ఫీల్డ్‌లో నిలబడతారని, అంతేగానీ కేవలం టాలెంట్ లేకుండా వచ్చిన ఎందరో వారసులు కనుమరుగైన విషయాన్ని గూర్చి సురేష్ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. ఇందులో సురేష్ బాబు ఇన్‌డైరెక్ట్‌గా దాసరి కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ సైతం హీరోగా నిలబడలేకపోయిన విషయాన్ని తెలియజేశాడు. అంతేకాదు.. పెద్ద సినిమాలు కనీసం విడుదలకు ముందు రెండు వారాల గ్యాప్ తీసుకోవాలనే సలహాను కూడా సురేష్ తప్పుపట్టాడు. సినిమాలో మ్యాటర్ ఉంటే ఎప్పుడు రిలీజ్ చేసినా హిట్టవుతాయని, గతంలో ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయిందంటూ సమాధానం ఇచ్చాడు. నాని, రాజ్‌తరుణ్ వంటివారు వారసులు కాకపోయినా హీరోలుగా నిలదొక్కుకున్న విషయాన్ని సురేష్ గుర్తుచేశాడు. కానీ దాసరి వర్గం మాత్రం దీనిని ఖండిస్తోంది. వరుసగా వస్తున్న స్టార్ వారసులను చూపించకుండా కేవలం చిన్న చిన్న అవకాశాలు దక్కించుకుంటున్న నాని, రాజ్‌తరుణ్‌లను ముందుకు తేవడం హాస్యాస్పదం అంటున్నారు. మొత్తానికి అంతా బాగానే ఉంది అనిపిస్తూనే ఒకరిపై ఒకరు సెటైర్లు విసురుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ వివాదాలు మరింత పెద్దవి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.