అక్కినేని నాగార్జున సమరశంఖం పూరిస్తున్నాడు. ఆయన కూడా తన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రాన్ని సంక్రాంతికే బరిలో దించాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్', జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' పోటీలో ఉన్నాయి. అయినా సరే నందమూరి హీరోలతో పోటీ పడటానికే నాగ్ మొగ్గుచూపిస్తున్నాడు. వాస్తవానికి డిసెంబర్‌లో వచ్చే క్రిస్‌మస్ నాగ్‌కు ఎంతో కలిసి వచ్చింది. కానీ డిసెంబర్‌లోనే తన పెద్ద తనయుడు నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు సిద్దమవుతుండటంతో.. నాగ్ సంక్రాంతికి బరిలో దిగాలని నిర్ణయించుకున్నాడు. కళ్యాణ్‌కృష్ణ అనే నూతన దర్శకునిని పరిచయం చేస్తూ తాను తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయన'పై ఆయన ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. ఇందులో కొడుకుకు మాత్రమే కనిపించే ఆత్మ పాత్రలో తండ్రిగా నాగార్జున అదరగొట్టాడని సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నాగార్జున సొంత బేనర్ 'అన్నపూర్ణ స్టూడియోస్' పతాకంపై రూపొందింది. త్వరలో 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. నాగ్ తన 30ఏళ్ల కెరీర్‌లో సంక్రాంతి కానుకగా కేవలం మూడు చిత్రాలు మాత్రమే వచ్చాయి. అవి 'మజ్ను, విజయ్, కిల్లర్'. వీటిల్లో 'మజ్ను, కిల్లర్' చిత్రాలు ఓకే అనిపించగా, 'విజయ్' మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.