సినీ రంగంలో వారసులు రంగప్రవేశం చేస్తున్నారు. కొత్తవారిని రానివ్వట్లేదు.. హీరోలుగా వారే చెలామణి అవుతున్నారు అనే విమర్శలు తెలుగు సినీ పరిశ్రమలో తరచుగా ఆడియో ఫంక్షన్స్‌లో.. ప్రెస్‌మీట్స్‌లో వినిపిస్తుంటాయి. అయితే ఈ మాటలు వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో కష్టం అంటున్నారు టాలీవుడ్‌లో కొంత మంది నిర్మాతలు. సినీరంగ నేపథ్యం లేకుండా వచ్చిన కొంత మంది హీరోల్లో క్రమశిక్షణ వుండటం లేదని... ముఖ్యంగా టైమ్ సెన్స్, దర్శక, నిర్మాతలకు ఇచ్చే గౌరవం విషయాల్లో వాళ్లు చాలా పూర్‌గా వుంటున్నారనేది వారి వాదన. వారసులుగా రంగ ప్రవేశం చేసే హీరోలను ఆ కుటుంబం అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చి.. మా బాటలోనే క్రమశిక్షణగా నడవాలనే సూచనలతో సినీ రంగంలోకి పరిచయం చేస్తున్నారు సదరు సీనియర్ నటీనటులు. కానీ కొత్తగా ఎటువంటి నేపథ్యం లేకుండా సినీ రంగంలోకి వచ్చి.. హీరోలుగా రెండు విజయాలు సాధించగానే వారిలో మార్పు కనిపిస్తుందని.. వారసులుగా వచ్చిన హీరోల్లో కనిపించే క్రమశిక్షణ వారిలో కనిపించడం లేదని అంటున్నారు సదరు నిర్మాతలు. ముఖ్యంగా నేటి యువ హీరోల్లో ఆ పోకడ కనిపిస్తుందని... ఇది వారి కెరీర్‌కు మంచిది కాదని.. సినీరంగంలో సక్సెస్ వున్నంత వరకే ఛరిష్మా వుంటుందని.. ముఖ్యంగా ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోలు ఫేడ్‌అవుట్ అయిపోవడానికి ఎంతో టైమ్ పట్టదని అంటున్నారు. అంతేకాదు సినీనేపథ్యం వున్న హీరోలతోనే కంఫర్ట్‌గా వుంటుందని, హీరోలుగా వారే కరెక్ట్ అని కూడా సదరు నిర్మాతలు భావిస్తున్నారు.