నిర్మాతగా రాధామోహన్ మరో మెట్టు పైకి ఎక్కేసారు. చిన్న చిత్రాలలో తనకంటూ ముద్ర వేసుకున్న చిన్న నిర్మాత స్థాయి నుండి సంపత్ నంది, రవితేజల బెంగాల్ టైగర్ కాంబినేషన్ సెట్ చేసే స్థాయిలోకి ఎదగడం పరిశ్రమకు శుభప్రదం. చిన్నా చితకా నిర్మాతలకు అసలు మనుగడే కష్టమవుతున్న తరుణంలో రాధామోహన్ గారు బిగ్ లీప్ తీసుకుని ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
అంతటితో ఆగకుండా బెంగాల్ టైగర్ చిత్రాన్ని తమకు గట్టిపోటీగా భావిస్తున్న ఎందఱో అపోజిషన్ నిర్మాతలకు, వాళ్ళ చిత్రాల పట్ల సానుకూల దృక్పదంతో విడుదలకు పచ్చజెండా ఊపి తన బెంగాల్ టైగరుకి మాత్రం ఎర్ర జెండా వేసి రిలీజును ఆపేసుకుని అందరివాడుగా మారారు. నితిన్ అండ్ అఖిల్ కోసం ఒకసారి, పీవీపీ అండ్ సైజు జీరో కోసం రెండోసారి, కోన అండ్ శంకరాభరణం కోసం మూడోసారి తన బెంగాల్ టైగరుని బోనులొని బంధించారు. అలా అలా డిసెంబర్ పదికి వెళ్ళిపోయిన మాస్ మహారాజా మూవీకి ఇపుడు యావత్ పరిశ్రమ నుండి బేషరతుగా సపోర్ట్ దొరుకుతోంది.
తోటి నిర్మాతల కష్టాలు తెలిసినవాడిగా రాధామోహన్ తీసుకున్న ఈ నిర్ణయాలు అతన్ని పరిశ్రమలోని అన్ని రకాల శక్తులకు దగ్గరివాడిని చేసాయి అనడంలో సందేహం లేదు. ఎప్పుడు విడుదలయినా బెంగాల్ టైగర్ కోసం మేమందరం కష్టపడతాం అంటున్నారు రాధామోహన్ సహాయ సహకారాలు పొందిన నిర్మాతలు. అందరి మనసులు గెలిచి, ఇంతటి పాజిటివ్ ఎనర్జీతో వస్తుందంటే బెంగాల్ టైగర్ సూపర్ హిట్టు కొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.