యూనివర్సల్ హీరో కమల్‌హాసన్ తన 40 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఎవ్వరూ అటెమ్ట్ చెయ్యలేని క్యారెక్టర్లు చేసి ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలిచాడు. అతని కెరీర్‌లో ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలు వున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కమల్ చేస్తున్న సినిమాలు కేవలం తన కోసమే తీసుకుంటున్నట్టుగా వున్నాయి తప్ప కమర్షియల్‌గా కూడా సినిమాని సక్సెస్ చెయ్యాలన్న ఆలోచనతో చేసినట్టుగా కనిపించడం లేదు. ఈమధ్యకాలంలో కమల్ చేసిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోవడమే దానికి ఎగ్జాంపుల్. కొత్తదనం వున్న క్యారెక్టర్లు చెయ్యాలన్న తపన అతని వయసుతోపాటు పెరుగుతూ వస్తున్నట్టుగా వుంది. ఆర్థికంగా తను వున్న ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఆలోచన అతనికి లేదు. అందుకే దేనితో నిమిత్తం లేకుండా తనకు నచ్చిన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు కమల్.
అలాంటి కోవలోకి చెందినదే చీకటి రాజ్యం. తెలుగు, తమిళ భాషల్లో కమల్‌హాసన్ నటించి, నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న తమిళ్‌లో రిలీజ్ అయి ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. తమిళ్‌లో ఫ్లాప్ అయిన సినిమాల్ని, ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాల్ని తెలుగులో సూపర్‌హిట్ చేసిన ఘనత మన తెలుగు ప్రేక్షకులకు వుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమల్‌హాసన్ తెలుగు వెర్షన్ పబ్లిసిటీ మీద పూర్తి దృష్టి పెట్టాడు. చీకటి రాజ్యం చిత్రాన్ని తప్పకుండా చూడాలన్న ఆలోచన ప్రేక్షకులకు కలిగించేందుకు అన్నిరకాల ప్రమోషన్స్‌తో ముందుకెళ్తున్నాడు కమల్. అరవై సంవత్సరాలు దాటినా అలుపెరుగని ఈ వెర్సటైల్ హీరో ఎంతో ఇష్టంతో నిర్మించిన చీకటి రాజ్యం చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిస్తారో మరి.