సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్నది ఎవరికి? అనే ప్రశ్న ఇప్పటివరకు అక్కడి సినీ వర్గాల్లో ఎప్పటినుండో అందరి మదిని తొలిచేస్తోంది. రజనీ తర్వాతి స్థానం అజిత్‌ది అని కొందరు, కాదు.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేది విజయ్ అని మరికొందరు వాదిస్తూ వస్తున్నారు. కానీ రజనీ తర్వాతి స్ధానం ఖచ్చితంగా అజిత్‌కే దక్కుతుందని ఇప్పటికి ఓ నిర్ణయానికి వచ్చాయి కోలీవుడ్ వర్గాలు. ఆయన వరుస విజయాలతో తన దూకుడు చూపిస్తూ సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే వరుస విజయాలతో హాట్రిక్ హిట్లు కొటిన అజిత్ తాజాగా రెండో హ్యాట్రిక్‌కు సిద్దమయ్యాడు. ఇటీవల కాలంలో ఆయన హీరోగా చేసిన 'ఆట ఆరంభం, వీరం, ఎన్నై అరిందాల్' చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన అజిత్ తాజాగా చేసిన 'వేదలమ్' చిత్రంతో మరో విజయం తో హ్యాట్రిక్ కి సిద్దం అయ్యాడు. తాజాగా విడుదలైన 'వేదలమ్' చిత్రం తమిళనాడులో సంచలన విజయాన్ని నమోదు చేసే స్థాయిలో దూసుకుపోతోంది. మొదటి షో నుండే ఈ చిత్రానికి సూపర్‌హిట్ టాక్ వచ్చింది. పోటీగా కమల్ నటించిన 'తుంగావనం' ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం 'వేదలమ్'కే మొదటి ఓటు వేస్తున్నారు. కథలో కొత్తదనం లేకపోయినా కథనం మాత్రం అద్బుతంగా ఉందని కితాబు ఇస్తున్నారు. గతంలో అజిత్‌తో 'వీరం' వంటి సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు శివనే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. అజిత్ స్టైలిష్ గెటప్, అద్బుతమైన నటనకు తోడు శృతిహాసన్ గ్లామర్ కూడ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. మొత్తానికి ఈ విజయంతో రజనీ తర్వాత ఆస్దానం అజిత్‌కే దక్కుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.