అక్కినేని అఖిల్ ఆరంగేట్రానికి ఇంకా ఒక్క రోజే సమయం మిగిలి ఉంది. ఎల్లుండి ఈ సమయానికి అఖిల్ సినిమా భవితవ్యం తేలిపోతుంది. ఒకానొక సమయంలో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి కుర్ర హీరోల తెరంగేట్రానికి కనిపించిన హడావిడి కన్నా అఖిల్ సినిమాకు కూసంత ఎక్కువ సందడే కన్పిస్తోంది. దీనికి కారణం మరే ఇతర కుర్ర హీరో డెబ్యూ చిత్రానికి పెట్టనంత బడ్జెట్, సాంకేతికత, కాస్ట్ అండ్ క్ర్యూ ఈ సినిమాకు ఉపయోగించడమే. నితిన్, సుధాకర్ రెడ్డిలు అఖిల్ మూవీని న భూతో న భవిష్యత్ అన్న స్థాయిలో నలభై కోట్ల పై చీలుకు ఖర్చుతో తీసారంటే ఆషామాషీ కాదు. అందుకు తగ్గట్టుగానే మరే హీరో సమీప భవిష్యత్తులో కూడా అందుకోలేని కమర్షియల్ స్థాయిలో విడుదలను ప్లాన్ చేసారు. ఒకే ఒక్క నైజాం ఏరియాలో 400 థియేటర్స్ అఖిల్ కోసం కేటాయించారంటే ఉధృతి అర్థం చేసుకోండి. ఓపెనింగ్స్ సైతం స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల రేంజులో ఉంటాయన్నది వ్యాపార వర్గాల అంచనా.
వినాయక్ లాంటి యాక్షన్ దర్శకుడి ఇమేజ్ కూడా తోడవడంతో అఖిల్ తొలి రోజు 10 కోట్ల షేర్ వరకు సాధించే అవకాశం ఉంది. మార్కెట్టులో సినిమాకున్న హైప్ చూస్తే, అదృష్టం కొద్ది అనుకున్నవి అనుకున్నట్టుగా గనక జరిగితే అఖిల్ ఫస్ట్ మ్యాచులోనే అర్థ సెంచరీ బాదడం ఖాయం. దీపావళి పండగ సీజన్, పైగా గట్టి పోటీదారులు కూడా లేకపోవడంతో 50 కోట్ల క్లబ్బు అందుకోవడం ఇతగాడికి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.