వాస్తవానికి తెలుగు ప్రజలందరికీ ముఖ్యమైన పండగ దసరా. ఈ పండగకు పిల్లలకు కూడా సెలవులు ఇస్తారు కాబట్టి మన టాలీవుడ్ వారు కూడా దసరాను క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ పండగ ముగిసిపోతే ఇక సంక్రాంతి వరకు పెద్దగా సినిమాల హంగామా ఉండదు. కానీ ఈసారి మాత్రం దసరాకు కొనసాగింపుగా దీపావళి, క్రిస్మస్‌తో సహా సంక్రాంతి వరకు సీజన్‌కు పొడిగింపుగా సినిమాల రిలీజ్‌లతో హడావుడి జరుగనుంది. మొత్తానికి నవంబర్, డిసెంబర్.. ఈ రెండు నెలలు సినిమాలే సినిమాలు. నవంబర్‌లో 'త్రిపుర', 'అఖిల్', 'బెంగాల్‌టైగర్', 'శంకరాభరణం, కుమారి 21ఎఫ్' ఇలా పలు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. దీనికి తోడుగా డబ్బింగ్ చిత్రాలైన 'చీకటిరాజ్యం, ఆవేశం, ప్రేమలీలా' వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఇక డిసెంబర్‌లో అనుష్క 'సైజ్‌జీరో', నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన', గోపీచంద్, రెజీనాలు హీరోహీరోయిన్లుగా రవికుమార చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న 'సౌఖ్యం' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక డిసెంబర్‌లోనే వరుణ్‌తేజ్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మా అమ్మ మహాలక్ష్మీ' (వర్కింగ్ టైటిల్) కూడా విడుదలకు సిద్దమవుతోంది. వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఈ రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాయి.