మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకుని ఐశ్వర్య బచ్చన్ అయినా, ఇప్పుడు ఆద్యాకి తల్లయినా నటన మీద మాత్రం ఇంకా తపన తగ్గలేదు. అందుకే గ్రాండ్ కం-బ్యాక్ ఫిలిం అని జజ్బాను విపరీతంగా హైప్ చేసినా, బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. వయసుకు తగ్గ క్రిమినల్ లాయర్ పాత్రలో కిడ్నాప్ గావించబడ్డ కూతురి కోసం ఆరాటపడే తల్లిగా ఐశ్వర్య ఎప్పటిలాగానే నటనలో నూటికి నూతి మార్కులు వేయించుకోగలిగింది. కానీ వాణిజ్యపరంగా అంతంత మాత్రంగానే ఆడిన జజ్బా కనీసం వంద కోట్ల క్లబ్బులో కూడా చేరలేకపోయింది. దీనికి కారణం ఇదీ అని తెలియక నిర్మాత, దర్శకుడు సంజయ్ గుప్త ఇప్పుడు ఈ హిందీ సినిమాను తెలుగీకరించి డబ్బింగ్ ఖాతాలో తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు.
అడ్వకేట్ అనురాధ వర్మ పేరుతో ఈ నెల తొమ్మిదిన రాబోతున్న ఈ సినిమా ఎంత వరకు మన ప్రేక్షకులను ఆకట్టుకోగలదు అన్నది అనుమానమే. ఎందుకంటే అదే వారంలో రానున్న అఖిల్, చీకటి రాజ్యం వంటి పెద్ద హీరోల చిత్రాల ప్రవాహంలో అనురాధకు, ఐశ్వర్యకు ఎటువంటి ఫోకస్ ఉండకపోవచ్చు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.