బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ సోలో చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అయినా అతని చేతిలో చాలా సినిమాలు వున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన అతని సినిమాలు గానీ, చేస్తున్నవిగానీ మొత్తం ఎనిమిది వున్నాయి. శంకర, పండగలా వచ్చాడు, సావిత్రి, అప్పట్లో ఒకడుండేవాడు, తుంటరి, వీరుడు, కోటలో రాజకుమారి, జో అచ్యుతానంద సినిమాలు అతని ఖాతాలో వున్నాయి. ఈ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదుగానీ అతని ఖాతా మాత్రం పెరిగిపోతోంది.
కాగా, తాజాగా మరో సినిమా అతని ఖాతాలోకి చేరబోతోంది. అది రాజా చెయ్యివేస్తే. నారా రోహిత్ హీరోగా ప్రదీప్ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించే ఈ చిత్రం అతనికి తొమ్మిదో సినిమా కాబోతోంది. వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రోహిత్‌కి ఆ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయోనన్న టెన్షన్ ఎక్కువైపోతోందట. ఒక దశలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు మరో సినిమా కమిట్ అవకూడదని డిసైడ్ అయిన రోహిత్‌కి రాజా చెయ్యివేస్తే సినిమా సైన్ చెయ్యక తప్పలేదు. లేటెస్ట్ మూవీతో కలిపి అతని సినిమాలు తొమ్మిది రిలీజ్ కావాల్సి వున్నాయి. మరి అందులో ఎన్ని సక్సెస్ అవుతాయో, మరెన్ని అతన్ని నిరాశపరుసాయో! వెయిట్ అండ్ సీ.