రొట్ట కథలు, మాస్ చిత్రాలకు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తున్న ఈ రోజుల్లో రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాను మాత్రమే సెంటర్ చేసి ఇంతలా నిందించడానికి కారణం ఏంటి?
ఇదే కోన వెంకట్, గోపి మోహన్ గార్లు రాసిన పండగ చేస్కోను పరమ రొటీన్ సీన్లతో నింపేసి, అత్తారింటికి దారేదిని అదో రకంగా చెప్పినందుకు క్రిటిక్స్ కీమా దంచేసినా, సామాన్య ప్రేక్షకులు మాత్రం ఎంతో కొంత ఆదరించి రామ్ కెరీరుకు ఉపయోగపడేలా చేసారు. నిజానికి ముందుగా మీడియా సైతం పండగ చేస్కోకు వ్యతిరేకంగా రివ్యూలు, ఇతరత్రా విశ్లేషణలు చేసినప్పట్టికీ కింది సెంటర్లలో జనాల్లోకి తీసుకెళ్ళడానికి బాగా దోహదపడింది. తదనంతరం ఇదే మూవీ రామ్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా హయ్యెస్ట్ వసూళ్లు సాధింఛి రికార్డు సృష్టించింది.
కానీ బ్రూస్ లీ గ్రహచారం ఇంకోలా ఎందుకు ఏడిసింది? కామన్ ఆడియెన్సు అభిరుచి ఎలా ఉందొ తెలీదు గాని ప్రిమియర్ షో పడిన మొదటి క్షణం నుండే ప్రచార సాధనాలన్నీ మూకుమ్మడిగా బ్రూస్ లీ పై విపరీత దాడికి దిగిపోయాయి. ఒకటో రెండో వెబ్ సైట్లు మూడు చుక్కల రేటింగులు ఇచ్చి ప్రాణ వాయువు ఊద బోయినా మిగతా వారు మాత్రం నిక్కచ్చిగా చుక్కలు చూపించారు.
రామ్ చరణ్ సినిమాలు, కథల ఎంపిక పట్ల వైరాగ్యంతో అతనొక్కడిని వీరంతా అటాక్ చేసారంటే కొందరి వాదనతో ఎకీభవించ వచ్చు కానీ ఆరేళ్ళ తరువాత మెగా స్టార్ తెర మీదకి ఆగమనం చేస్తున్నారన్న సాఫ్ట్ కార్నర్ కూడా లేకుండా బ్రూస్ లీతో కరాటే ఆడేసుకున్నారంటే ఆశ్చర్యం తక్కువ, ఆలోచన ఎక్కువవుతుంది.
ప్రప్రథమంగా స్టార్ హీరోల సినిమాల కోసం మీడియాను మ్యానేజ్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు ముందుండి మరీ అందరినో, అందిన కొందరినో మచ్చిక చేసుకునే వ్యూహాలు రచించుకుంటారు. బ్రూస్ లీ విషయంలో ఎంత మాత్రం పరిణతి లేకుండా విడుదలకి ఒక్క రోజు రాత్రి ముందు నుండే సోషల్ మీడియాలో విషం కక్కడం మొదలయిందంటే సదరు నిర్మాతలు ఎంత జాగ్రత్త తీసుకున్నారో అవగతమవుతుంది.
ఓ సినిమా నిలబడాలన్న, చతికిలబడాలన్నా మీడియా ప్రమేయం ఉండాల్సిందే. మరి మెగా పవర్ స్టార్ పై అందరూ కక్ష గట్టి ఇంతలా బద్నాం చేయాలన్న ప్లానుకు బీజం ఎక్కడ పడింది, అసలు ఈ సినిమా టీంలో తప్పిదం ఎక్కడ జరిగిందో వారే పునరాలోచించుకుంటే మున్ముందు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురు కావు.