వెటకారానికి ప్యాంటు చొక్కా వేస్తే అది రామ్‌గోపాల్‌వర్మ అవుతాడు. ఆయన ఇటీవలి కాలంలో మెగాహీరోలపై వరుసపెట్టి వ్యంగపు ట్విట్టర్ పోస్ట్‌లు చేస్తున్నాడు. ఇటీవలే పవన్‌పై విరుచుకుపడ్డ ఆయనకు మెగాభిమానులు ధీటుగానే సమాధానం ఇవ్వడంతో మరోసారి ఆయన తన కసిని ఎక్కుపెట్టి ఈ సారి మెగాస్టార్ చిరంజీవిపై విరుచుకుపడ్డాడు. ఎవరు ఎన్ని అనుకున్నా బ్రూస్‌లీ చిత్రమే మెగాస్టార్ 150వ చిత్రంగా తాను భావిస్తున్నానని, ఇందులో చిరు నటించడం తనకు నచ్చలేదని, ఇంటికి వెళ్లి ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూస్తే అసలైన బ్రూస్‌లీ ఎవరో తేలుతుందని వ్యాఖ్యానించాడు. బ్రూస్‌లీ చిత్రంలో చిరు నటించడం ప్రజారాజ్యం పార్టీ పెట్టినంత తప్పని, తెలిసి తెలిసి మెగాస్టార్ ఆ పని చేశాడని విమర్శించాడు. ఇక చిరు చేయబోయే తదుపరి చిత్రం తన దృష్టిలో 151వ సినిమా మాత్రమే అని, ఆ చిత్రాన్ని కూడా కత్తికి రీమేక్‌గా చేయడం ఆయన మెగాభిమానులను అవమానించడమే అని, రాజమౌళి బాహుబలి వంటి తనదైన సొంత సబ్జెక్ట్‌తో సంచలనం సృష్టిస్తే...చిరు మాత్రం తమిళ రీమేక్‌ను చేయాలనుకోవడం మహా పెద్ద పొరపాటు అని, రాజమౌళి వంటివారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడితే, తమిళ రీమేక్‌లో చేయడం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టడం మాత్రమే అని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజెప్పాడు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవిపై వర్మకు ఉన్న కోపం ఇప్పటిది కాదు... 20ఏళ్ల కింద నుండి ఆ కోపం ఉంది. నాగార్జున, వెంకటేష్‌లతో సినిమాలు చేసిన వర్మకు చిరు ఓ సినిమాకు చాన్స్ ఇచ్చాడు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకొని, కర్నూల్‌లో షూటింగ్ పార్ట్ కూడా కొంత జరుపుకున్న తర్వాత చిరు వర్మ పద్దతి నచ్చక ఆయనను సినిమా నుండి తీసివేయడం జరిగింది. అంతేగాక తన ప్రియశిష్యుడు పూరీజగన్నాథ్‌కు 150వ చిత్రం డైరెక్షన్ చాన్స్ ఇవ్వకపోవడం కూడా వర్మ కోపానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ మెగావార్ ఎప్పటివరకు, ఎలా మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది...!