7జి బృందావనకాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు వంటి చిత్రాల ద్వారా క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి సెల్వరాఘవన్ అలియాస్ శ్రీరాఘవ. ఆయన తెరకెక్కించి అత్యధిక చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. కాగా అనుష్క, ఆర్య ముఖ్యపాత్రల్లో భారీ బడ్జెట్‌తో పివిపి సంస్థ నిర్మించిన వర్ణ చిత్రం మాత్రం కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా డిజాస్టర్ ఫలితాన్ని పొందింది. దాంతో అప్పటివరకు అతని డైరెక్షన్‌లో సినిమాలు తీయాలని, ఆయన డైరెక్షన్‌లో నటించాలని ఉబలాటపడిన స్టార్స్ సైతం వెనకడుగువేశారు. ఈ ఒక్క చిత్రంతో ఆయన కెరీర్ మొత్తం నాశనం అయింది. ఎవ్వరూ ఆయనకు మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. మరోపక్క కుటుంబ కలహాలతో సైతం ఆయన మనశ్శాంతి కోల్పోయి తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యారు. దాంతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న ఆయన కెరీర్ గాడి తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరలా ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే కసితో శింబు హీరోగా ఖాన్ అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు. గ్రాండ్ స్కేల్‌లో తీయాలని భావించిన ఈ చిత్రం కొద్దిరోజులు షూటింగ్ జరుపుకొని ఆర్థికకారణాలతో అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రానికి ఫైనాన్షియర్స్ కూడా దొరకడం లేదు. మరి ఈ దర్శకుడిని ఆర్ధికంగా ఆదుకొని ఈ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కించే వారు ఎవరా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సెల్వరాఘవన్ కెరీర్‌కు ఇది అగ్నిపరీక్షలాంటి సమయం అని ఒప్పుకోవాలి...!