సినిమా సెలబ్రిటీస్ కమర్షియల్ యాడ్స్‌లో నటించడమనేది ఎప్పటి నుంచో వుంది. యాడ్స్‌లో నటించేందుకు హీరోలు, హీరోయిన్లు ఎప్పుడూ సుముఖంగానే వుంటారు. సినిమాలతో ఎంత బిజీగా వున్నా యాడ్స్ కోసం కూడా డేట్స్ ఎడ్జస్ట్ చేస్తుంటారు. కొంతమంది హీరోలు తమకు ఎంత స్టార్‌డమ్ వచ్చినా కమర్షియల్ యాడ్స్ చెయ్యడానికి ఇష్టపడరు. సినిమాలతోనే కాదు, ఇలా యాడ్స్ చేస్తూ కూడా డబ్బు సంపాదిస్తున్నాడని అందరూ అనుకోవడం వారికి ఇష్టం వుండదు. అలాంటి వారిలో అమితాబ్ బచ్చన్ మొదటివాడుగా చెప్పుకోవచ్చు. జీవితం అందరి సరదా తీర్చేస్తుంది అని పూరి చెప్పినట్టు అవసరం ఏ పనైనా చేయిస్తుంది. అమితాబ్ మంచి స్వింగ్‌లో వున్నప్పుడు కమర్షియల్ యాడ్స్‌లో నటించమని అడిగిన వారికి నో చెప్పేవాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను స్టార్ట్ చేసి ఆ బేనర్‌లో కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో సంపాదించింది కాస్తా కరిగిపోయింది. ఇక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కమర్షియల్ యాడ్స్ చెయ్యడానికి ఒప్పుకున్నాడు. యాడ్స్ ద్వారా, కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు అమితాబ్.
అమితాబ్ లైఫ్‌లో జరిగిన స్టోరీయే ఇప్పుడు కమల్‌హాసన్‌కీ రిపీట్ అవుతోంది. సౌత్ ఇండియాలో 30 సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కమల్ కూడా కమర్షియల్ యాడ్స్ చెయ్యడానికి ఇష్టపడేవాడు కాదు. అతను హీరోగా మంచి స్వింగ్‌లో వున్నప్పటి నుంచి దశావతారం, విశ్వరూపం సినిమాలు చేసే వరకు కూడా అతన్ని యాడ్స్‌లో చూపించాలని ట్రై చేసి చాలా మంది ఫెయిల్ అయ్యారు. అయితే జీవితం కమల్ సరదా కూడా తీర్చేసినట్టుంది. ప్రస్తుతం అతను కూడా ఆర్థిక మాంద్యంతో కొట్టు మిట్టాడుతున్నాడు. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యక తప్పదు కాబట్టి ఇప్పుడు యాడ్స్ చెయ్యడానికి ఓకే అంటున్నాడు. అందులో భాగంగా మొదటి యాడ్ పోతీస్ టెక్స్‌టైల్స్ వారికి చేశాడు. సౌత్ ఇండియాలో ఎన్నో షోరూమ్స్ వున్న పోతీస్ కమల్‌ని తమ టెక్స్‌టైల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ చేసుకుంది. తన పాలసీని పక్కన పెట్టి యాడ్స్ చెయ్యడానికి సుముఖత చూపిస్తున్న కమల్ లైఫ్ కూడా అమితాబ్ లైఫ్‌లాగే టర్న్ అవుతుందేమో చూడాలి.